స్పందన ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం : జెసి

ప్రజాశక్తి – ద్వారకాతిరుమల

స్పందన దరఖాస్తులు రీఓపెన్‌ కాకుండా నాణ్యమైన రీతిలో పరిష్కరించాలని జెసి బి.లావణ్యవేణి అధికారులను ఆదేశించారు. ద్వారకాతిరుమలలోని కాపు కళ్యాణ మండపంలో శుక్రవారం ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు తలారి వెంకట్రావుతో కలిసి ప్రజల నుండి వినతులను స్వీకరించి, వాటి పరిష్కారానికి అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమం ప్రజల నుండి అందే విజ్ఞప్తులను క్షేత్ర స్థాయిలో పరిశీలించిన తరువాత, ప్రజలు సంతృప్తి చెందే రీతిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. పరిష్కార విధానంపై ప్రజలు సంతృప్తి చెందని కారణంగా దరఖాస్తులు రీ ఓపెన్‌ అవుతున్నాయన్నారు. పంచాయతీ కార్యదర్శులు, గ్రామ/వార్డ్‌ సచివాలయ సిబ్బంది, సంబంధిత శాఖల అధికారులు ప్రజలు తెలియజేసిన సమస్యలను పూర్తిగా అర్ధం చేసుకుని, క్షేత్రస్థాయిలో విచారణ చేసి, దరఖాస్తులు ఎందుకు రీ ఓపెన్‌ అవుతున్నాయో కారణాలు తెలుసుకుని, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. మండల స్థాయిలో నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమంలో అందిన దరఖాస్తులపై జిల్లాస్థాయిలో కూడా సమీక్షిస్తామని, స్పందన దరఖాస్తుల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జెసి హెచ్చరించారు. ఎంఎల్‌ఎ తలారి వెంకట్రావు మాట్లాడుతూ పేదల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని, వాటిని అర్హులైన పేదలకు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. అనంతరం ద్వారకాతిరుమల సర్పంచి కె.స్వర్ణలత తన దరఖాస్తులో ద్వారకాతిరుమలలో తాగునీటి పైపులైన్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కొత్త తాగునీటి పైపులైన్లు వేయాలని, వీధి దీపాలు లేని కారణంగా ద్వారకాతిరుమలకు నడకదారిన వచ్చే యాత్రికులకు ఇబ్బంది ఉందని, లక్ష్మీపురం నుండి ద్వారకాతిరుమల వరక వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ అధికారులను జెసి ఆదేశించారు. ఇలా పలు సమస్యలపై అర్జీలు అందాయి. ఈ కార్యక్రమంలో డిఆర్‌డిఎ, హౌసింగ్‌ పీడీలు విజయరాజు, కె.రవికుమార్‌, జిల్లా వ్యవసాయశాఖాధికారి వై.రామకృష్ణ, డ్వామా పీడీ రాము, పశుసంవర్థక శాఖ జెడి నెహ్రూబాబు, జంగారెడ్డిగూడెం ఆర్‌డిఒ అద్దయ్య, తహశీల్దార్‌ సతీష్‌ పాల్గొన్నారు.

➡️