ఎయిడ్స్‌ రహిత సమాజం నిర్మించాలి : కలెక్టర్‌

ప్రజాశక్తి – ఏలూరు

ఎయిడ్స్‌ రహిత సమాజ స్థాపనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ ప్రసన్నవెంకటేష్‌ పిలుపు నిచ్చారు. ప్రపంచ ఎయిడ్స్‌ దినోత్సవం సందర్భంగా ఎయిడ్స్‌/హెచ్‌ఐవిపై అవగాహన కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఇండియన్‌ రెడ్‌ క్రాస్‌ సొసైటీ వాలంటీర్లను, సర్‌ సిఆర్‌ రెడ్డి కళాశాల ఎన్‌సిసి క్యాడెట్లు, వివిధ కళాశాలల ఎన్‌సిసి క్యాడెట్లను విద్యార్థులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. సమాజహితం కోసం చేసే ఇలాంటి కార్యక్రమాల్లో యువత ప్రధానపాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు. ఎయిడ్స్‌ బాధితుల పట్ల వివక్ష చూపకుండా వారిపై ఆదరణ చూపుతూ పూర్తిస్థాయి జీవితాన్ని అందించేలా కృషిచేయాలన్నారు. ఎయిడ్స్‌ నియంత్రణపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయన్నారు. హెచ్‌ఐవిని తొలిదశలోనే గుర్తించి పరీక్షలు చేయడం వల్ల విస్తరించేందుకు అవకాశం ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఆర్‌డిఒ ఎన్‌ఎస్‌కె.ఖాజావలి, డిఇఒ శ్యామ్‌ సుందర్‌, విభిన్న ప్రతిభావంతుల శాఖ ఎడి రాకాడ మణి, ఎయిడ్స్‌ నియంత్రణ అధికారి నాగేశ్వరరావు, జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ చీఫ్‌ కోచ్‌ బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు.

➡️