ప్రజాశక్తి-ఎర్రబాలెం : మోడీ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా నవంబర్ 27, 28 తేదీలలో 36 గంటలపాటు విజయవాడలో జరిగే కార్మిక, రైతు, ఉద్యోగ సంఘాల ఉమ్మడి ఆందోళనకు మద్దతు ఇవ్వాలని సిఐటియు రాజధాని డివిజన్ అధ్యక్షులు ఎం రవి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్మికులు ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను నాలుగు కోడ్ లుగా మార్చి కార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వం విధానాలను కార్మికులు వ్యతిరేకించాలని కోరారు. నల్ల చట్టాలు తెచ్చి రైతు, కార్మిక వ్యతిరేక విధానాలు హవలంబిస్తూ, అధిక ధరలతో ప్రజల నడ్డి విరుస్తూ ప్రైవేటీకరణ వైపు పరుగులెడుతూ కార్పొరేట్ శక్తులకు ఊడిగం చేస్తున్న కేంద్రంలోని మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలందరూ వ్యతిరేకించాలని అన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, 26 వేల రూపాయలు జీతం ఇవ్వాలని అన్నారు. నూతన పెన్షన్ స్కీమును రద్దుచేసి, పాత పెన్షన్ పథకం పునరుద్ధరించాలని, కనీస ఈపీఎఫ్ పెన్షన్ 9000 రూపాయలు ఇవ్వాలని కోరారు. విద్యుత్ సవరణ చట్టం రద్దు చేయాలని అన్నారు. రద్దు చేసిన పాసింజర్ రైళ్లను, రైల్వే రాయితీలను పునర్ధరించాలని కోరారు. కార్మిక సంఘాల ఐక్యవేదిక, రైతు సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఈనెల 27, 28 తేదీల్లో విజయవాడ జింఖానా గ్రౌండ్స్ లో జరిగే మహాధర్నాలో కార్మికులు, రైతులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని రవి కోరారు.