ఛలో విజయవాడ.. 36 గంటల మహాధర్నా జయప్రదం చేయండి

Nov 23,2023 16:13 #Guntur District

ప్రజాశక్తి-తెనాలి (గుంటూరు) : ఈనెల 27, 28 తేదీలలో విజయవాడలో చేపట్టిన మహా ధర్నా జయప్రదం చేయాలని సిఐటియు జిల్లా నాయకులు కె.బాబు ప్రసాద్‌ పిలుపునిచ్చారు. కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 36 గంటల మహాధర్నాను ఉద్దేశించి స్థానిక చెంచుపేట ప్రజా సంఘాల కార్యాలయంలో గురువారం రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సిఐటియు డివిజన్‌ కార్యదర్శి షేక్‌. హుస్సేన్‌ వలి అధ్యక్షతన జరిగిన సమావేశంలో బాబు ప్రసాద్‌ మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో ఆర్డినెన్సు ద్వారా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని రైతులు పోరాడి విజయం సాధించారన్నారు. అయితే రైతుల డిమాండ్లను మాత్రము ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. వ్యవసాయంలో ఎదురవుతున్న ప్రతికూల పరిస్థితులతో రైతులు ఆత్మ హత్యలు చేసుకుంటున్నారన్నారు. రైతులకు వ్యవసాయం లాభసాటి కావాలంటే స్వామి నాధన్‌ కమిషన్‌ సిఫారసులు అమలు చేయాలని, కార్మికుల హక్కులను కాలరాసే లేబర్‌ కోడ్‌లను రద్దు చేయాలని, కనీస వేతనం అమలు చేయాలని, కాంట్రాక్ట్‌ కార్మికులను, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరించాలని, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా సరుకులను అందించాలని కోరుతూ జరుగుతున్న మహాధర్నాను జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో పి.జోనేష్‌, జి.వెంకటసుబ్బయ్య, సిహెచ్‌. శేషగిరి రావు, ఆర్‌.శివకృష్ణ, కె.తార కేస్వర్‌, వై.అశోక్‌ కుమార్‌, పి.నాగరాజు, ఎం.సాంబశివరావు, పి.సాయి, బ్రహ్మరెడ్డి పాల్గొన్నారు.

➡️