సంబరంగా ‘సత్యసాయి’ స్నాతకోత్సవం

సంబరంగా 'సత్యసాయి' స్నాతకోత్సవం

బంగారు పతకాలు, పట్టాలు సాధించిన విద్యార్థులతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, మంత్రి ఉషశ్రీ

అనంతపురం ప్రతినిధి, పుట్టపర్తి అర్బన్‌ : శ్రీ సత్యసాయి డీమ్డ్‌ యూనివర్శిటీ 42వ స్నాతకోత్సవ వేడుకలు బుధవారం నాడు సంబరంగా జరిగాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మూ ముఖ్య అతిథిగా హాజరవగా, రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ అతిథిగా హాజరయ్యారు. ఇద్దరు ప్రముఖులు రావడంతో పుట్టపర్తిలో సందడి వాతావరణం నెలకొంది. సత్యసాయిబాబా జయంతికి ఒక రోజు ముందు స్నాతకోత్సవం జరగడం అనవాయితీగా వస్తోంది. అందులో భాగంగా గురువారం నాడు 98వ జయంతి వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా బుధవారం నాడు విశ్వవిద్యాలయం స్నాతకోత్సవ వేడుకలు జరిగాయి. సాయిహీరా గ్లోబల్‌ కన్వెన్షన్‌ హాలులో జరిగిన ఈ వేడుకలు ఎంతో క్రమశిక్షణతో సాగాయి. ప్రారంభోత్సవానికి ముందు విద్యార్థులు వాయించిన బ్యాండ్‌ అందరినీ ఆకట్టుకుంది. అనంతరం స్నాతకోత్సవాన్ని ఛాన్సలర్‌ కృష్ణమాచారి చక్రవర్తి ప్రారంభించారు. విశ్వవిద్యాలయంలో కొనసాగుతున్న కార్యకలాపాల గురించి వైస్‌ ఛాన్సలరు రాఘవేంద్ర ప్రసాద్‌ వివరించారు.500 మందికి డిగ్రీలు ప్రదానం42వ స్నాతకోత్సవం సందర్భంగా 14 మందికి పిహెచ్‌డిలు, 500 మందికి డిగ్రీలు, పీజీ పట్టాలను ప్రదానం చేశారు. వివిధ విభాగాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన 21 మందికి బంగారు పతకాలను రాష్ట్రపతి చేతుల మీదుగా అందించారు. సత్యసాయి సేవలు అభినందనీయం : రాష్ట్రపతిప్రపంచ ఆధ్మాత్మిక కేంద్రంగానున్న పుట్టపర్తిలో సమగ్రమైన విద్యను సత్యసాయి ట్రస్టు ద్వారా అందిస్తుండటం అభినందనీయమని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు. ‘సత్యం వద… ధర్మం చర’ అన్న నినాదాన్ని సత్యసాయిబాబా ప్రకటించినట్టుగానే… ప్రతి ఒక్కరూ సత్యాన్ని పాటించి, ధర్మాన్ని ఆచరించాలని సూచించారు. మహాత్మాగాంధీ కూడా సత్యశోధన ప్రాధాన్యతను ఎప్పుడూ చెప్పేవారని గుర్తు చేశారు. ఉన్నతమైన విద్యా విజ్ఞానాన్ని అందించేదే కాకుండా సమాజ పునర్‌ నిర్మాణంలో ఎంతో కీలకమని చెప్పారు. నైతిక విలువలు, జీవన విలువలను విద్య అందిస్తుందన్నారు. బాబా బోధించిన మానవతా విలువలు ఆధ్యాత్మికత కలగలిపి ఆధునిక విజ్ఞానాన్ని అందించేందుకు చక్కటి విద్యాసంస్థలను పుట్టపర్తిలో నెలకొల్పాలన్నారు. మానవతా విలువలు ఆధ్యాత్మికత శాస్త్ర సాంకేతిక అంశాలతో కూడిన సమ్మిళిత విద్యను బోధిస్తూ అద్భుతమైన ఫలితాలతో ప్రపంచంలోనే మేటి విద్యాసంస్థల సరసన సత్యసాయి విద్యా సంస్థలు విలువలకు నిలయాలుగా నిలిచాయన్నారు. సత్యసాయి ప్రజలకు వైద్య, విద్య, మంచినీరు వంటి ఎన్నో సేవలు అందించారన్నారు. భగవాన్‌ సత్యసాయిబాబా సేవలను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు వారి అడుగుజాడలలో నడవాలని సూచించారు. ఈ ప్రాంతాన్ని సందర్శించి, బాబా మహాసమాధిని సందర్శించుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.ప్రాచీన గురుకుల విద్య తరహాలో ఇక్కడి విద్య : గవర్నర్‌రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌ మాట్లాడుతూ మన ప్రాచీన ఆధ్యాత్మిక సంపద ఎంతో విలువైనదని చెప్పారు. ప్రాచీన గురుకుల విద్య తరహాలోనే సత్యసాయి విద్యా సంస్థల్లోనూ విద్యను అందించడం ముదావాహమన్నారు. లోక సమస్త సుఖీనోభవంతు’ అని వేదాల్లో చెప్పినట్టుగా మన ప్రాచీనపరంపర శాంతి, సౌభ్రాతృత్వాలను కోరుకుంటుందని పేర్కొన్నారు. ‘విద్యా దదాతి వినయం…వినయాద్వాతి పాత్రతాం’ అని చెప్పినట్టుగా విద్య ద్వారా వినయం.. వినయం ద్వారా అర్హత.. అర్హత ద్వారా సంపద అన్నీ వస్తాయని పేర్కొన్నారు. సమగ్రమైన విద్యను పొందడం ద్వారా విజ్ఞానం పొందడమే కాకుండా సమాజాభివృద్దికి తోడ్పడినవారమవుతామని చెప్పారు. ఈ కార్యమ్రంలో రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీచరణ్‌, సత్యసాయి సెంట్రల్‌ ట్రస్టు మేనేజింగ్‌ ట్రస్టీ ఆర్‌జె.రత్నాకర్‌, సెంట్రల్‌ ట్రస్టు సభ్యులు ఎస్‌.నాగానంద్‌ తదితరులు పాల్గొన్నారు.

➡️