వీడియో కాన్ఫిరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌ అరుణ్‌బాబు

కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు

నేడు, రేపు పోలింగ్‌ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు

పుట్టపర్తి అర్బన్‌ : జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో ముసాయిదా ఓటర్ల జాబితా సవరణపై శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్‌ పి.అరుణ్‌బాబు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌ కుమార్‌మీనాకు వివరించారు. శుక్రవారం నాడు విజయవాడలోని ఎన్నికల ప్రధాన అధికారి కార్యాలయం నుంచి ముసాయిదా ఓటర్ల జాబితా సవరణపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. పుట్టపర్తి కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ పాల్గొన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌ అనంతరం కలెక్టర్‌ నియోజకవర్గ ఈఆర్వోలతో మాట్లాడారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో ఒకే రకమైన ఫొటోలు, ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మారిపోయినవి, మతులు, ఒక ఇంటి నెంబర్‌పై 10 కంటే ఎక్కువ ఓట్లు, ఒకే వ్యక్తి పేరున రెండు, మూడు అంతకన్నా ఎక్కువ ఓట్లు ఉండడం లాంటి వాటి తొలగింపునకు గట్టి చర్యలు తీసుకోవాలన్నారు. స్వచ్ఛమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు బాధ్యతాయుతంగా కషి చేయాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా నేడు, రేపు ప్రతి పోలింగ్‌ కేంద్రంలో తప్పనిసరిగా ముసాయిదా ఓటర్ల జాబితాపై బిఎల్‌ఒలతో ప్రత్యేక శిబిరం నిర్వహించాలన్నారు. అభ్యర్థనలు, తొలగింపులు, కొత్త ఓటర్ల నమోదు, అభ్యంతరాల నిమిత్తం అందిన దరఖాస్తు వివరాలను రిజిస్టర్‌లో పక్కాగా నమోదు చేయాలని సూచించారు. జిల్లాలో ముఖ్యంగా 18, 19 సంవత్సరాల యువ ఓటర్ల నమోదుపై దృష్టి పెట్టి నమోదు చేయించాలన్నారు. పిఎస్‌ఈ, డిఎస్‌ఈ జనరేషన్‌పై క్షేత్రస్థాయిలో తప్పనిసరిగా పరిశీలన చేసి పరిష్కారం చేయాలని కలెక్టర్‌ పేర్కొన్నారు. ఈ వీడియో జాయింట్‌ కలెక్టర్‌ టిఎస్‌.చేతన్‌, డిఆర్వో కొండయ్య, ఆర్డీవోలు కదిరి వంశీకష్ణారెడ్డి, ధర్మవరం రమేష్‌ రెడ్డి, పుట్టపర్తి భాగ్యరేఖ, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

➡️