అంగన్‌వాడీ సమస్యల పరిష్కారానికి పోరాటం

రౌండ్‌టేబుల్‌ సమవేశంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు

రౌండ్‌టేబుల్‌ సమవేశంలో పాల్గొన్న సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు

       అనంతపురం కలెక్టరేట్‌ : అంగన్‌వాడీల సమస్యల పరిష్కారానికి నిరవధిక పోరాటం కొనసాగించాలని కార్మిక సంఘాల నేతలు తెలిపారు. డిసెంబర్‌ 8 నుంచి అంగన్వాడీల రాష్ట్రవ్యాప్త నిరవధిక సమ్మెకు మద్దతు కోరుతూ గురువారం నాడు అనంతపురంలోని జెవివి కార్యాలయంలో రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని నిర్వహించారు. అంగన్వాడీ వర్కర్స్‌ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి రమాదేవి అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలు కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కార్మికుల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం గత నాలుగున్నర సంవత్సరాలుగా వివిధ రూపాల్లో నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని తెలిపారు. జగన్మోహన్‌రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆయన్ను కోరుతున్నా పట్టించుకునే పరిస్థితి కన్పించడం లేదన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ ఇవ్వాలన్నారు. గత ఆరు నెలల నుంచి పెండింగ్‌లో ఉంచిన సెంటర్‌ అద్దెలు, టిఎ బిల్లులు తక్షణం చెల్లించాలన్నారు. ఆయాల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచి, రాజకీయ జోక్యాన్ని నివారించాలన్నారు. మినీ వర్కర్లను మెయిన్‌ వర్కర్లుగా గుర్తించి వేతనాలు, ఉద్యోగోన్నతులు కల్పించాలన్నారు. వీటితో పెండింగ్‌లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబర్‌ 8 నుంచి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్‌ చేపట్టిన నిరవధిక సమ్మెకు కార్మిక సంఘాలు మద్దతు తెలుపుతున్నట్లు సమావేశంలో ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ జిల్లా కోశాధికారి జమున , సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబుళు, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నాగమణి, నాగేంద్రకుమార్‌, ఎఐటియుసి నాయకులు రాజేష్‌గౌడ్‌, టిఎన్‌టియుసి నాయకులు పోతులలక్ష్మి, నరసింహులు, బిసిసెల్‌ అధ్యక్షులు సిమెంటు పోతన్న, పూల బాషా, రైతుసంఘం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌, కౌలురైతు సంఘం జిల్లా కార్యదర్శి బాలరంగయ్య, మున్సిపల్‌ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి నాగభూషణ తదితరులు పాల్గొన్నారు.

➡️