రాత్రి వేళల్లో పోలీసు గస్తీ పెంచాలి

డీఎస్పీకి వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు

ప్రజాశక్తి-గుంతకల్లు

వారంరోజులుగా పట్టణంలోని అనేక ప్రాంతాల్లో జరుగుతున్న చోరీలను దృష్టిలో ఉంచుకుని రాత్రి వేళల్లో పోలీసులు గస్తీ పెంచాలని సిపిఎం పట్టణ ప్రధాన కార్యదర్శి బి.శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. ఈమేరకు బుధవారం పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ నర్సింగప్పను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని రోజులుగా పట్టణంలో దొంగలు రాత్రి వేళలో యథేచ్ఛగా ఇళ్లలోకి చొరబడి బంగారు నగలు, నగదు దోచుకుంటున్నారన్నారు. ముఖ్యంగా పట్టణంలోని సత్యనారాయణపేట రోడ్డు, మార్కెట్‌, మున్సిపల్‌ ఆఫీస్‌ ఎదురుగా, 60 అడుగుల రోడ్డు, కొత్త బస్టాండ్‌, తిలక్‌నగర్‌, ఉమామహేశ్వర్‌ నగర్‌, తదితర ఏరియాల్లో చోరీలు అధికమయ్యాయన్నారు. గతంలో రాత్రిపూట పోలీస్‌ పెట్రోలింగ్‌ వీధివీధుల్లో, మెయిన్‌ రోడ్‌లో తిరిగేవారన్నారు. దీంతో రాత్రి 10 గంటలైతే రోడ్లమీద ఆకతాయిలు, రౌడీలు కనపడేవారు కాదన్నారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదన్నారు. రాత్రి ఒంటి గంట అయినా రోడ్ల మీద ఆకతాయిలు తిరుగుతున్నారన్నారు. పోలీస్‌ శాఖ వెంటనే స్పందించి రాత్రిపూట పెట్రోలింగ్‌ ఏర్పాటు చేసి ప్రజలను దొంగల బారి నుంచి కాపాడాలని కోరారు. అదేవిధంగా డిగ్రీ, ఇంటర్‌ మహిళా కళాశాలల వద్ద పోకిరీలు విద్యార్థినులను ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు మారుతీప్రసాద్‌, సాకే నాగరాజు, షేక్‌ షబ్బీర్‌బాషా, సురేంద్ర, తిమ్మప్ప, చంద్ర, ఓబులేసు, నాయక్‌, ప్రతాప్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️