రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగిద్దాం

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌

 

ప్రజాశక్తి-అనంతపురం

రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని మాజీ ఎమ్మెల్సీ డాక్టర్‌ గేయానంద్‌ పిలుపునిచ్చారు. శనివారం స్థానిక శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ఆలిండియా లాయర్స్‌ యూనియన్‌ (ఐలు), ఎస్‌కెయు న్యాయవిభాగం ఆధ్వర్యంలో ‘రాజ్యాంగ స్ఫూర్తి-ఆటంకాలు-అమలు’ అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం దానికదే ఒక విప్లవం అన్నారు. రెండువేల సంవత్సరాలకుపైగా ఉన్న ఒక అసమాన వ్యవస్థ నిర్మాణాన్ని బద్దలు చేసిందన్నారు. అంతేగాకుండా కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా దేశంలోని ప్రజలందరినీ ఒక్కటి చేయగలిగిందన్నారు. అయితే కొంతకాలంగా రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీయడానికి అనేక ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. ఇందులో భాగమే రాజ్యాంగ పీఠిక నుంచి ‘సోషలిస్టు’ (సామ్యవాద), ‘సెక్యులర్‌’ (లౌకికవాద) పదాలను తొలగించాలని సుబ్రమణ్యస్వామి సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేయడం, పైగా తన వాదనకు బలం చేకూర్చుకోవడానికి సోషలిస్టు భావనను వ్యతిరేకించినట్టుగా అంబేద్కర్‌ మాటలను ఉటంకించారన్నారు. ఇది అంబేద్కర్‌ను పూర్తిగా తప్పుగా అర్థం చేసుకోవడమే అన్నారు. ప్రజలు నేడు స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే రాజ్యాంగ కల్పించిన హక్కులే కారణం అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్‌ న్యాయవాది, ఐలు జిల్లా గౌరవాధ్యక్షులు సీతారామరావు, విశ్రాంత న్యాయమూర్తి శివశంకర్‌, విశ్రాతం ప్రొఫెసర్‌ పుల్లారెడ్డి, ఐలు రాష్ట్ర సమితి సభ్యులు సూర్యచంద్ర, జిల్లా అధ్యక్ష కార్యదర్శి వీరూయాదవ్‌, సతీష్‌, జిల్లా నాయకులు బోయ పురుషోత్తం, నాగరాజు, ప్రకాష్‌, మల్లేష్‌గౌడ్‌, రవి, అశోక్‌, లోకేష్‌, సుదర్శన్‌, పురుషోత్తం, చంద్ర, శ్రీకాంత్‌, న్యాయ విద్యార్థులు పాల్గొన్నారు.

➡️