మహాధర్నాకు తరలిన సిఐటియు, రైతుసంఘాల నేతలు

మహాధర్నాకు వెళ్తున్న సిఐటియు, రైతుసంఘాల నేతలు

 

ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్‌

దేశవ్యాప్తంగా రైతులు, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సిఐటియు, ఎపి రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఈనెల 27, 28వ తేదీల్లో విజయవాడలో నిర్వహించనున్న మహాధర్నాకు ఆయా సంఘాల నేతలు, కార్యకర్తలు ఆదివారం తరలివెళ్లారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.నాగేంద్రకుమార్‌, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలతో రైతులు, కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను సిఎం జగన్‌ తూచా తప్పకుండా వేగవంతంగా అమలు చేస్తున్నాడని విమర్శించారు. వ్యవసాయ సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ముఖ్యంగా వ్యవసాయ మోటార్లకు విద్యుత్‌ మీటర్లు బిగించి భారాలు మోపుతున్నారని తెలిపారు. దేశ సంపదను కార్పొరేట్‌ సంస్థలకు లూటీ చేయించడమే పనిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. రైతులు కరువు కోరల్లో చిక్కుకుని ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వాలు అలసత్వంగా వ్యవహరించడం దారుణంగా ఉందన్నారు. కార్మికుల సంక్షేమాభివృద్ధిని దెబ్బతీసేలా 44 చట్టాలను నాలుగు కోడ్‌లుగా తీసుకొచ్చారని మండిపడ్డారు. ఉపాధి హామీ పథకం నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్ర చేస్తోందన్నారు. కార్మికులు, రైతులు, వ్యవసాయ కూలీలను ఆదుకోవాలని కోరుతూ 27, 28 తేదీల్లో విజయవాడలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు నాగమణి, నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజా, నాయకులు ఆజాంబాషా, తిరుమలేష్‌, ఇర్ఫాన్‌, రైతు సంఘం జిల్లా నాయకులు మధు, బిహెచ్‌.రాయుడు, పోతులయ్య, నల్లప్ప, వెంకటకొండ, నారాయణరెడ్డి, చిదంబరమ్మ తదితరులు వెళ్లారు.

➡️