8 నుంచి అంగన్వాడీల నిరవధిక సమ్మె
కళ్యాణదుర్గం : న్యాయమైన సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఈ నెల 8వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అంగన్‌వాడీలు సమ్మెలోకి వెళ్తున్నట్లు సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు తెలిపారు. తెలంగాణా కంటే అందనంగా వేతనాలు చెల్లిస్తానన్న జగన్ హామీని అమలుచేయాలని కోరుతూ రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్‌కు సమ్మె నోటీస్‌ను అంగన్‌వాడీ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు శకుంతల, రమాదేవితో కలిసి శుక్రవారం నాడు కళ్యాణదుర్గంలోని మంత్రి నివాసంలో వినతిపత్రం, నిరవధిక సమ్మె నోటీసులను అందజేశారు. ఈ సందర్భంగా ఓబులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అంగన్వాడీలకు గ్రాడ్యుటీ ఇవ్వాలన్నారు. గత ఆరు నెలల నుంచి పెండింగ్‌లో ఉంచిన సెంటర్‌ల అద్దెలు, టలె బిల్లులు తక్షణం చెల్లించాలన్నారు. ఆయాల ప్రమోషన్లకు వయోపరిమితి 50 సంవత్సరాలకు పెంచాలన్నారు. రాజకీయ జోక్యాన్ని నివారించాలన్నారు. మినీ వర్కర్లను మెయిన్ వర్కర్లుగా గుర్తించి వేతనాలు, ప్రమోషన్లు కల్పించాలన్నారు. ఫేస్ రికగ్నైజేషన్ యాప్ రద్దు చేయాలన్నారు. సర్వీసులో ఉండి చనిపోయిన అంగన్వాడీ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం, బీమా అమలు చేయాలని కోరారు. వేతనంతో కూడిన మెడికల్ లీవ్ సౌకర్యం, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఐదు లక్షలు చెల్లించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారం కోరుతూ ఈ నెల 8 నుండి రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీ వర్కర్స్ నిరవధిక సమ్మెలోకి వెళ్తున్నట్లు చెప్పారు. డిసెంబర్ 6వ తేదీ విజయవాడలో చర్చలకు ఆహ్వానిస్తున్నట్లు మంత్రి తెలియజేశారని, ఈ చర్చలు సానుకూలంగా పరిష్కారం కావాలని లేకపోతే డిసెంబర్ 8 నుంచి సమ్మెలోకి వెళ్తామని స్పష్టం చేశారు. అంగన్వాడీలు చేసే న్యాయమైన పోరాటానికి ప్రజాస్వామికవాదులు, రాజకీయ పార్టీలు, మేధావులు, ప్రజా సంఘాలు మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమావేశంలో ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ నాయకులు పాతక్క తదితరులు పాల్గొన్నారు.