విలేకరులతో మాట్లాడుతున్న మాజీమంత్రి కాలవ శ్రీనివాసులు
ప్రజాశక్తి-రాయదుర్గం
ప్రభుత్వ నిధులతో రాష్ట్రంలో ప్రచారం చేస్తున్న వైసిపి బిసిలకు ఎక్కడ రక్షణ కల్పించిందో చెప్పాలని టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం రాయదుర్గంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఇటీవల రాయదుర్గం నియోజకవర్గంలో వైసిపి నాయకుల ఆగడాలు, దౌర్జన్యాలు ఎక్కువైపోతున్నాయని ఆరోపించారు. ‘ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ’ అన్న చందంగా ఆరునెలల్లో దిగిపోయే వైసిపి హింసను ప్రేరేపిస్తోందన్నారు. ఇటీవల కణేకల్ మండలంలో వైసిపి నాయకులు బీసీలపై దౌర్జన్యాలు చేశారన్నారు. గరుడచేడు గ్రామంలో కురుబ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎంపీపీ రాజగోపాల్‌రెడ్డికి చెందిన భూమిని మరొకరికి కట్టబెట్టేందుకు ప్రయత్నించగా ఆ వ్యక్తి తనపై కక్షతో తనను ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని,తనకు ఆత్మహత్య శరణ్యమని సీఎంకు వాయిస్ రికార్డింగ్ ద్వారా విజ్ఞప్తి చేశారన్నారు. గురువారం జక్కలవడికి సమీపంలో అదే కురుబ సామాజిక వర్గానికి చెందిన హనుమంతురెడ్డి కుటుంబంపై విచక్షణారహితంగా దాడి చేసి మహిళను ఈడ్చి దౌర్జన్యం చేశారన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సాక్ష్యంగా వెలుగులోకి వచ్చిందన్నారు. సర్పంచి భర్త హనుమంతురెడ్డి కర్ణాటక రాష్ట్రం నుండి అక్రమ మద్యం రవాణా, వ్యాపారం చేస్తుండగా అతడికి కణేకల్ పోలీస్‌స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న రఘునాథరెడ్డి అండగా ఉన్నారన్నారు. గతంలో కూడా రఘునాథరెడ్డి తమ పార్టీకి సంబంధించిన వారిపై దౌర్జన్యం చేసి వారిపైనే కేసులు పెట్టారన్నారు. ఇటీవల జరిగిన ఈ రెండు ఘటనలకు సంబంధించిన ఆధారాలు వివరాలను జిల్లా పోలీస్ సూపరింటెండెంట్‌కు పంపిస్తామన్నారు. ఈ రెండు ఘటనలకు మూల కారణం జగనన్న భుహక్కు- భూ రక్ష పథకం అన్నారు. భూముల రీసర్వే పేరుతో అనేక ఏళ్లుగా వారి అనుభవంలో ఉన్న భూములను హద్దులు మార్చి ఇతరులకు కట్టబెట్టేందుకు చర్యలు చేస్తున్నారన్నారు. ఈ దుర్మార్గాలు, దౌర్జన్యాల కోసం జగన్ మళ్లీ ఏపీకి సీఎం కావాలా.. అని నిలదీశారు. ఆయా ఘటనలపై దర్యాప్తు చేపట్టి దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈసమావేశంలో టిడిపి పట్టణ అధ్యక్షుడు నాగరాజు, డి.హీరేహాల్ మండల నాయకులు మోహన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.