బడుగుల సంక్షేమం, అభివృద్ధే ధ్యేయం

ప్రజలకు అభివాదం చేస్తున్న వైసిపి నాయకులు

 

ప్రజాశక్తి-తాడిపత్రి

బడుగు, బలహీన వర్గాల అభివృద్ధే సిఎం జగన్‌ ధ్యేయమని మంత్రులు కారుమూరి నాగేశ్వరరావు, ఉషశ్రీచరణ్‌, ఎంపిలు నందిగామ సురేష్‌, తలారి రంగయ్య అన్నారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలో సామాజిక సాధికార యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడుతూ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను అక్కున చేర్చుకుని, వారిస్థాయిని పెంచేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తోంది ఒక్క సిఎం జగన్‌ మాత్రమే అన్నారు. చంద్రబాబు హయాంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను ఎంత చులకనగా చూశారో, ఎన్ని అవమానాలు చేశారో చూశామన్నారు. చంద్రబాబు బడుగు, బలహీన వర్గాలను ఓటుబ్యాంకు రాజకీయాలకే పరిమితం చేశారని విమర్శించారు. బడుగు, బలహీన వర్గాల సామాజికస్థాయి, ఆర్థిక ఉన్నతి పెంచిన అసలు సిసలైన ప్రజానాయకుడు జగనన్న అని కొనియాడారు. జగనన్న కటౌట్‌ పెడితేనే ఇంత మంది తరలివచ్చారంటే.. ఆయనపై మీకెంత అభిమానం ఉందో అర్థమవుతోందన్నారు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమ్మ ఒడి, వసతి దీవెన, విద్యాదీవెన, వైఎస్సార్‌ రైతు భరోసా, సున్నావడ్డీ, ఉచిత పంటల బీమా, ఫించన్‌ కానుక, చేయూత, ఆసరా, నేతన్న నేస్తం, జగనన్న చేదోడు, ఆరోగ్యశ్రీ, కళ్యాణమస్తు, షాదీతోఫా వంటి పథకాలను ఎన్నో తీసుకొచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు శంకర్‌ నారాయణ, ఆసిఫ్‌ ఖాన్‌, కాపు రామచంద్రారెడ్డి, నాయకులు విశ్వేశ్వర్‌రెడ్డి, ఏడీసీసీ ఛైర్‌పర్సన్‌ లిఖిత, వైసిపి జిల్లా అధ్యక్షులు మహిళా నర్సింహయ్య, తదితరులు పాల్గొన్నారు.

➡️