అనంతపురం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహిస్తున్న సిపిఎం నాయకులు
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.ప్రభాకర్‌రెడ్డి
అనంతపురం కలెక్టరేట్ : ఈ ఏడాది ఖరీఫ్‌లో వర్షాభావంతో పంటలన్నీ పూర్తిగా చేతికందకుండా పోయాయని ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ప్రతి రైతుకూ స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఎకరాకు రూ.50వేలు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె.ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంట నష్టపరిహారం, ఇతర వ్యవసాయ అనుబంధ సమస్యల పరిష్కారం కోరుతూ అనంతపురం కలెక్టరేట్ వద్ద సిపిఎం ఆధ్వర్యంలో బుధవారం ఉదయం ధర్నా నిర్వహించారు. అంతకు ముందు ఎండిపోయిన పత్తి, కంది, వేరుశనగ పంటలతో నగరంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. కలెక్టర్ కార్యాలయం ముందు బైటాయించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ అనంతపురం జిల్లాలో వర్షాభావంతో తీవ్రమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించినా కరువు సహాయక చర్యలు చేపట్టడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఇక పంట నష్టపరిహారం అంచనాల కోసం ఈ నెల 14న జీవో నెంబర్:5 రైతులకు మరింత నష్టదాయకంగా ఉందని, దీనిని తక్షనం రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పంటల సాగుకు బ్యాంకులు పెట్టుబడి రుణం ఇవ్వడానికి నిర్ణయించిన స్కేల్‌ఆఫ్ ఫైనాన్స్ ఆధారంగా పంట నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఎకరాకు గరిష్టంగా రూ.50వేలు, వర్షాభావం వల్ల విత్తనం కూడా వేయలేని రైతులకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాలన్నారు. రైతు, కౌలురైతు, వ్యవసాయ కార్మిక కుటుంబాల విద్యార్థుల అన్ని రకాల ఫీజులను రద్దు చేయాలన్నారు. వలసలను నివారించేందుకు జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 200 రోజులు పని కల్పించి రోజుకు రూ.600 వేతనం ఇవ్వాలన్నారు. వంటసాగుచేసిన కౌలు రైతులకే పంటనష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రైతుల బ్యాంకు అప్పులన్నింటినీ మాఫిచేసి కొత్త రుణాలు ఇవ్వాలన్నారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డిఆర్‌ఒకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఓ.నల్లప్ప, బాలరంగయ్య, జిల్లా కమిటీ సభ్యులు రామిరెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, అర్‌వి.నాయుడు, మన్నీల రామాంజి, తరిమెల నాగరాజు, కృష్ణమూర్తి, వెంకటనారాయణ, ముస్కిన్, భాస్కర్, మండల నాయకులు పోతులయ్య, కుళ్లాయప్ప, శివశంకర్, చెన్నారెడ్డి నగర నాయకులు ప్రకాష్, సురేష్, ఇర్ఫాన్, లక్ష్మినారాయణ, వెంకటేష్ పాల్గొన్నారు.