ప్రజలకు అందుబాటులో ఉండాలి

జూమ్‌ కాన్ఫరెన్స్‌లో మాట్లాడుతున్న ఎస్పీ అన్బురాజన్‌

ప్రజాశక్తి-అనంతపురం క్రైం

ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ కెకెఎన్‌ అన్బురాజన్‌ ఆదేశించారు. శుక్రవారం నగరంలోని జిల్లా పోలీసు కార్యాలయంలో ఉన్న తన ఛాంబర్‌ నుంచి రక్షక్‌, బ్లూకోట్స్‌, హైవే పెట్రోలింగ్‌ సిబ్బందితోపాటు జిల్లాలోని సి.ఐ, ఎస్‌ఐలతో ఎస్పీ జూమ్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిత్యం గస్తీ తిరుగుతూ అనుమానాస్పద వ్యక్తులను గుర్తించాలన్నారు. నేరం జరిగిన ప్రదేశానికి తక్షణమే వెళ్లడం, రెస్క్యూ చేయడం, రోడ్డు ప్రమాదాల ఘటనలపై తక్షణమే స్పందించి గోల్డెన్‌ అవర్‌లో క్షతగాత్రులను సమీప ఆసుపత్రులకు తరలించడం వంటి కార్యక్రమాలు ప్రాథమిక బాధ్యతలుగా గుర్తించుకోవాలన్నారు. 24గంటలూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల రక్షణను బాధ్యతగా భావించాలన్నారు. ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణతో మొదలు శాంతిభద్రతల సమస్యలు, న్యూసెన్స్‌ ఘటనలు, అగ్ని ప్రమాద ఘటనలు, డయల్‌-100 కాల్స్‌, ఈవ్‌టీజింగ్‌, మార్నింగ్‌ వాకర్స్‌ రక్షణ, బ్యాంకులు, ఎటిఎం కేంద్రాలు, బంగారు షాపులు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, తదితర ప్రాంతాల్లో తిరుగుతూ నిఘా ఉంచాలని సూచించారు.

➡️