తాగు, సాగునీటి సమస్యలపై కలెక్టర్‌కు వివరిస్తున్న సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్
అనంతపురం కలెక్టరేట్ : జిల్లాలో ఏర్పడిన కరువుతో ప్రజలు, రైతులకు తాగు, సాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వి.రాంభూపాల్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు కలెక్టరేట్ రెవెన్యూ భవన్‌లో నిర్వహించిన స్పందన గ్రీవెన్స్‌సెల్‌లో కలెక్టర్ ఎం.గౌతమిని సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా రాంభూపాల్ మాట్లాడుతూ జిల్లాలో దశాబ్ధాలుగా నత్తనడకన నీటి వనరుల అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. దీని వల్ల సాగు, తాగునీటి కోసం ప్రజలు, రైతులు అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ఉన్న కష్టాలకు తోడు ఈ ఏడాది తీవ్రమైన కరువు నెలకొన్న నేపథ్యంలో నీటి సమస్య మరింత జఠిలం అయ్యే ప్రమాదం ఏర్పడిందన్నారు. ముంచుకొస్తున్న కరువు, గ్రామాల్లో వ్యవసాయ పనులు లేక మొదలైన వలసలు ప్రజల కష్టాలకు అద్దం పడుతున్నాయన్నారు. జిల్లాలో రైతుసంఘం నాయకులు రైతులతో అక్టోబర్ 29వ తేదీన చర్చావేదిక నిర్వహించిందన్నారు. ఇందులో మేధావులు, సాగునీటిరంగ నిపుణులు పలు అభిప్రాయాలు, సూచనలు చేశారని తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లా విడిపోయిన తర్వాత అనంతపురం జిల్లాకు నికరంగా 14.85 లక్షల సాగుభూమి ఉందన్నారు. ఇందులో స్థీరీకరించబడిన ఆయకట్టు 45,224 ఎకరాలు ఉందన్నారు. ఇందులో 2021-22లో సాగైన ఆయకట్టు భూమి కేవలం 4821 ఎకరాలు మాత్రమే అన్నారు. జిల్లాలో కేవలం 3.04 శాతం సాగుభూమికి మాత్రమే నీటి పారుదల సౌకర్యం ఉందన్నారు. రాష్ట్రంలోనే కాక దేశంలోనే అతితక్కువ వర్షపాతం కలిగిన అనంతపురం జిల్లాలో ఈ పరిస్థితి ఉండడం రైతాంగంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోందన్నారు. కరువుకు నిలయం అయిన అనంతపురం జిల్లాలో కనీసం లక్ష ఎకరాలకైనా నమ్మకమైన నీటివనరులు లేకపోవడం విచారకరం అన్నారు. జిల్లాలో వ్యవసాయం బతకాలంటే కనీసం 30 శాతం భూమికి సాగునీటి వనరులు కల్పించాలని జాతీయ ఇరిగేషన్ కమిషన్ 1972లో సూచించిందన్నారు. 2004లో ఏర్పాటైన జయతిఘోష్ కమిషన్, 2009లో స్వామినాథన్ కమిషన్ నివేదిక, 2012లో ఐసిఎఆర్ న్యూఢిల్లీ కమిటీ ఇచ్చిన నివేదికతో సహా అందరూ అనంతపురం జిల్లాలో కరువులను పారదోలాలంటే నదీజలాలను మళ్లించాలని సిఫార్సు చేశారని గుర్తు చేశారు. ఈ సిఫార్సులు ఇప్పటికీ అమలుకు నోచుకోని పరిస్థితి ఉందన్నారు. ప్రధాన నీటి వనరుగా చేపట్టిన తుంగభద్ర ఎగువ కాలువ ఆధునీకరణ పనులు అంతులేని నిర్లక్ష్యానికి గురువుతోందన్నారు. పెన్నఅహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నిర్మాణానికి నీటి విస్తరణకు అవసరమైన భూసేకరణ చేయకపోవడంతో 4, 5 టిఎంసిలకు మించి నిలువ చేసే పరిస్థితి లేదన్నారు. దీనిపై స్పందించి అవసరమైన భూసేకరణ జరిపి పూర్తి సామర్థ్యంతో నీటిని నిలువ చేయాలన్నారు. ఉంతకల్లు జలాశయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలన్నారు. బిటి ప్రాజెక్టుకు జీడిపల్లి నుంచి మొదలు పెట్టిన ఎత్తిపోతల పథకాన్ని వెంటనే పూర్తి చేయాలన్నారు. రైతు సామూహిక బిందు సేద్య పథకాలను పూర్తి చేయాలన్నారు. హంద్రీనీవా పంట కాలువల నిర్మాణం వెంటనే పూర్తి చేయాల్సుందన్నారు. అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో తీరని తాగునీటి సమస్య ఉందన్నారు. ఇందుకోసం జల్ జీవన్ పథకం సంపూర్ణంగా అమలు చేయాలన్నారు. చెరువులు, కుంటలను నీటి పారుదల కాలువతో అనుసంధానం చేయాలన్నారు. పెన్నా నదిని పునరుజ్జీవింప జేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పరిస్థితుల్లో జిల్లాలో జలవనరుల అభివృద్ధి పనులు, అడుగంటిన భూగర్భ జలాలు, తాగునీరు, సాగునీరు సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఓ.నల్లప్ప, జిల్లా కమిటీ నాయకులు ఆర్‌వి.నాయుడు, ముస్కిన్, వలి తదితరులు పాల్గొన్నారు.