కౌలు రైతులకు రుణాలివ్వాలి

బ్యాంకు అధికారితో మాట్లాడుతున్న కౌలు రైతుసంఘం నాయకులు

ప్రజాశక్తి-బొమ్మనహాల్‌

మండలంలో కౌలు రైతులకు వ్యవసాయ రుణాలు ఇవ్వాలని కౌలురైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రంగారెడ్డి, బాలరంగయ్య డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల పరిధిలోని ఉద్దేహాల్‌ గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో 5000 మంది కౌలు రైతులకు ప్రభుత్వం కార్డులు మంజూరు చేసిందన్నారు. అయితే ఇంత వరకూ ఏ ఒక్క రైతుకు కూడా బ్యాంకు రుణాలు ఇచ్చిన పాపానపోలేదన్నారు. కౌలు రైతుల పట్ల అధికారులకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రభుత్వ బ్యాంకు రుణాలు ఇవ్వడానికి సిఫార్సు చేయాలన్నారు. ముఖ్యంగా కర్ణాటక సరిహద్దులో ఉన్న బొమ్మనహాల్‌ మండలంలో కౌలురైతులను గుర్తించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారన్నారు. మండలంలో సుమారు 2000 మంది కౌలు రైతులు ఉండగా వారందరికీ కార్డులు ఇవ్వలేదన్నారు. ఆదిశగా రైతులకు అవగాహన కల్పించలేకపోయారన్నారు. అప్పులు చేసి సాగు చేసుకుంటున్న కౌలు రైతులు దిగుబడి రాక అప్పులపాలవుతున్నారన్నారు. అరకొర వచ్చే పంటల నష్ట పరిహారం కూడా భూమి యజమానులకు అందుతోందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, అధికారులు స్పందించి కౌలు రైతులకు కార్డులు మంజూరు చేయడంతోపాటు రుణాలు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లేనిపక్షంలో రానున్న రోజుల్లో ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు నాగమణి, ఉద్దేహాల్‌, కొలగానహళ్లి, ఉప్పర కృష్ణాపురం గ్రామాలకు చెందిన కౌలు రైతులు తిప్పేస్వామి, హనుమంతు, హరిజన గంగమ్మ, సుంకన్న, తదితరులు పాల్గొన్నారు.

తాజా వార్తలు

➡️