అనంతపురం కార్పొరేషన్ కార్యాలయం
అనంతపురం కార్పొరేషన్ : అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్‌లో పాలకవర్గం నేత, కమిషనర్‌కు నడుమ దూరం అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది. మేయర్ నిర్ణయాలను సైతం కమిషనర్ ఖాతర్ చేయడం లేదనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గత కొన్ని రోజులుగా అటు మేయర్, ఇటు కమిషనర్ మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది. ఇటీవల వీరిద్దరి మధ్య చోటు చేసుకుంటున్న వరుస ఘటనలు వారిమధ్య కోల్డ్‌వార్‌కు అద్దం పడుతున్నాయి. సాధారణంగా వివాదాలకు దూరంగా ఉండే మేయర్ మహమ్మద్ వసీం పాలనా వ్యవహారాల్లో అధికారులకు విపరీతమైన స్వేచ్ఛ ఇస్తుంటారు. స్వేచ్ఛగా పరిపాలన సాగేలా చూడాలనే ఆయన భావనను కొందరు అధికారులు మరోరకంగా తీసుకుంటున్నారు. కార్పొరేషన్‌లో ప్రతి చిన్న విషయం తనకు చెప్పే జరగాలని కమిషనర్ ఒంటెద్దు పోకడకు పోతోందనే అభిప్రాయాలను పాలకవర్గం సభ్యులు బాహాటంగానే విన్పిస్తున్నారు.
గత నెలలో కౌన్సిల్ సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. అనంతరం అర్బన్ ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌అండ్‌బి అతిథి గహంలో సాయంత్రం 6గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిర్వహించిన సమావేశంలో పలు సమస్యలపై చర్చించారు. అక్కడ ప్రాధాన్యత క్రమంలో అభివృద్ధి పనులను ఎలా చేయాలన్న దానిపై ప్రణాళిక చేసుకున్నారు. సమావేశం అనంతరం ఈ పనుల ప్రణాళిక కాగితం బుట్టదాఖలైనట్లు సమాచారం. స్వయంగా ఎమ్మెల్యే, మేయర్ పాల్గొన్న సమావేశంలో తీసుకున్న నిర్ణయాలే అమలుకు నోచుకోకపోవడంతో కౌన్సిలర్లు అధికారులపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
ల్యాప్‌ట్యాప్ రాదు.. సినిమాకు అనుమతి లేదు..!
కార్పొరేషన్‌లో ఒక అధికారికి ఐదు నెలల్లోనే రెండు ల్యాప్‌ట్యాప్‌లను కౌన్సిల్ ముందస్తు అనుమతి లేకుండానే ఇచ్చేశారు. ఇదే సమయంలో మేయర్‌కు సంబంధించి ల్యాప్‌ట్యాప్ తెప్పించాలన్న ఫైల్ గత 45 రోజులుగా కమిషనర్ లాగిన్‌లోనే ఆగిపోయింది. మేయర్‌కే ఇలాంటి పరిస్థితి ఎదురవడం విస్మయానికి గురి చేస్తోంది. నగరంలో ఇటీవల ఓ సినిమా చిత్రీకరణ జరుపుకుంది. రెండు రోజుల క్రితం జెడ్పీ కార్యాలయ ఆవరణలో కొంతమేర చిత్ర యూనిట్ షూటింగ్‌ను నిర్వహించారు. నగరంలో సినిమా చిత్రీకరణ జరుపుకోవడానికి ప్రారంభంలోనే సినిమా యూనిట్ జిల్లా ఎస్పీ నుంచి అనుమతి పొందినట్లు తెలుస్తోంది. జెడ్పీ ఛైర్మన్ గిరిజమ్మను కలిసి కార్యాలయ ఆవరణలో చిత్రీకరణకు అనుమతి కోరగా, ఆమె కూడా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇదే చిత్రబృందం అనంతపురం కార్పొరేషన్ కార్యాలయ ఆవరణలో చిత్రీకరణ జరుపుకునేందుకు సినిమా యూనిట్ మేయర్ మహమ్మద్ వసీంను కలిసి అనుమతి కోరారు. ఇందుకు అయన అంగీకరిస్తూ అనుమతిని ఇచ్చారు. ఇదేవిషయంపై కార్పొరేషన్ కార్యదర్శి సంఘం శ్రీనివాసులకు ఫోన్ చేసి చెప్పారు. ఈ అంశాన్ని కమిషనర్ ఛాంబర్‌కు కార్యదర్శి సమాచారం పంపారు. దీనిపై కమిషనర్ భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సినిమా యూనిట్ తనను కలిసి అనుమతి పొందాలి కానీ ఇలా సిఫార్సు చేయించడం ఏమిటిని సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా సినిమా చిత్రీకరణకు అనుమతి నిరాకరించినట్లు తెలుస్తోంది. వెంటనే చిత్రయూనిట్ మేయర్‌కు ఫోన్ చేసి కమిషనర్ తెలిపిన విషయాన్ని ఆయనకు వివరించారు. జెడ్పీలో అనుమతి ఇచ్చారు.. కార్పొరేషన్ ఇవ్వకపోడంతో చిత్రయూనిట్ కూడా ఒకింత కార్పొరేషన్ పాలకవర్గంపై అసహనం వ్యక్తం చేశారు.
మేయర్ ఆదేశాలు బుట్టదాఖలు..?
నగరంలోని హౌసింగ్ బోర్డ్ రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్‌లో అమ్యూజ్మెంట్‌పార్క్ నిర్వహించే సబ్ కాంట్రాక్టర్ ఆదివారం వేళల్లో టీ, కాఫీ స్నాక్స్ స్టాల్ నిర్వహిస్తున్నారు. దీనిపై స్థానిక కార్పొరేటర్ తనను కలవకుండా అనుమతి పొందకుండా స్టాల్ ఎలా నిర్వహిస్తారంటూ ప్రశ్నించారు. ఇదే విషయంపై కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. దీనిపై మేయర్ జోక్యం చేసుకుంటూ వారంలో ఒకరోజు స్టాల్ పెట్టుకుని జీవనం సాగించే వ్యక్తిని ఇబ్బంది పెట్టొద్దని, పార్కులో ఆమ్యూజిమెంట్ పార్క్ నిర్వాహకుడే దానిని నడుపుతున్నందున తొలగించటానికి చర్యలు చేపట్టవద్దని కమిషనర్‌కు సూచించినట్లు తెలిసింది. ఈ అంశంపై కమిషనర్ మేయర్ సూచనలను ఏమాత్రం లెక్కలోకి తీసుకోలేదు. ఇక వీధిలైట్ల స్టాక్ తెప్పించిన తర్వాత అత్యవసర పనులకై థర్టీపర్సెంట్ స్టాక్‌ను రిజర్వులో ఉంచుకోవాలని ఆఫీసు నిర్వహణ అధికారి డిఈఈకి మేయర్ సూచించారు. దీనికి కూడా కమిషనర్ లెక్కలోకి తీసుకోనట్లు తెలుస్తోంది. మేయర్ వీధిలైట్లపై చేసిన సూచనలను డిఈఈ పరిగణలోకి తీసుకోకుండా వచ్చిన స్టాక్ మొత్తం డివిజన్ల వారిగా 10 లైట్ల వంతున కేటాయించేశారు. దీనిపై మేయర్ డిఈఈని ప్రశ్నించగా కమిషనర్ ఆదేశాల మేరకు ఇలా చేసినట్లు తెలిపారు. ఇదే సమయంలో నగరంలోని శ్మశానాల్లో వీధిలైట్లు లేవని సంబంధిత వ్యక్తులు మేయర్‌ను కలిసి సమస్యను విన్నవించారు. ఈ సమస్యను పరిష్కరించాలంటూ మేయర్ సంబంధిత అధికారులకు తెలిపారు. వీధిలైట్లు లేకపోవడంతో శ్మశానవాటికలకు వీటిని అధికారులు ఇవ్వలేకపోయారు. వచ్చిన స్టాకును అత్యవసర సమయాల కోసం ఉంచుకోకుండా మొత్తం స్టాకును పంపిణీ చేయడం వల్లనే ఈ పరిస్థితి నెలకొంది. కమిషనర్ భాగ్యలక్ష్మి దిగువున నూతనంగా ఏర్పాటు చేసుకున్న ఛాంబర్‌కు టేబుల్ కుర్చీలతో సహా సర్వం నూతన సామగ్రినే తెప్పించుకున్నారు. పాత ఛాంబర్లోని కుర్చీలను దిగువ ఛాంబర్‌కు తెప్పించుకుని ఉంటే ప్రజాధనం ఆదా అయ్యేది. ఇదేసమయంలో మేయర్ ఛాంబర్‌లో సైతం కొత్త కుర్చీలు వేయించుకోవాలని కమిషనర్ సూచించారు. ఇందుకు మేయర్ ఉన్నవాటితో పని జరుగుతోంది కదా.? అనవసర ఖర్చు ఎందుకంటూ కమిషనర్‌కు తెలిపారు. ఇలా కార్పొరేషన్‌లో ప్రతి విషయంలో ఉన్నతాధికారి ఒంటెద్దు పోకడ నిర్ణయాలు చేస్తూ పాలకవర్గాన్ని నిర్లక్ష్యం చేస్తోందనే భావన కార్పొరేటర్లలో అధికం అవుతోంది. పాలకవర్గం మాటలను ఏమాత్రం ఖాతరు చేయని ఇలాంటి అధికారులతో వేగేది ఎలాగో తెలియక అటు మేయర్, ఇటు కార్పొరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. ముఖ్యనేతలు ఈ విషయంపై స్పందించి కార్పొరేషన్ ఉన్నతాధికారి, ఇతర సిబ్బంది పనితీరు మార్చుకునేలా చర్యలు తీసుకోవాలంటూ కార్పొరేటర్ల కోరుతున్నారు.