అనంతపురం రైల్వేస్టేషన్ వద్ద నిరసన తెలుపుతున్న సిఐటియు నాయకులు
అనంతపురం కలెక్టరేట్ : అంబానీ, ఆదానీ లాంటి కార్పొరేట్ల కోసం కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం భారత రైల్వే వ్యవస్థను ప్రయివేటు పరం చేసే కుట్ర చేస్తోందని, ఈ నిర్ణయాన్ని ప్రజలందరూ ముక్తకంఠంతో ఖండించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు పిలుపునిచ్చారు. రైల్వేల ప్రయివేటీయరణ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్ల ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలను చేపట్టారు. అనంతపురం రైల్వే స్టేషన్ వద్ద జరిగిన ఆందోళన కార్యక్రమంలో ఓబులు, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.నాగేంద్రకుమార్ మాట్లాడుతూ దేశంలో పేద ప్రజల ప్రయాణానికి అత్యంత చౌకగా, అనువుగా ఉన్నది భారత రైల్వే సంస్థ అన్నారు. కోట్లాది మంది నిత్యం రైళ్లలో రాకపోకలు సాగిస్తుంటారన్నారు. ఇంతటి ప్రాధాన్యత కలిగిన రైల్వే, వాటి ఆస్తులను బిజెపి ప్రభుత్వం ప్రయివేటు పరం చేయాలని చూడడం అత్యంత దుర్మార్గమైన చర్య అన్నారు. రైల్వే స్టేషన్లు, వాటి చుట్టుపక్క ఉన్న స్థలాలను ఆదానీ, అంబానీలకు నామమాత్రపు లీజుకు కట్టబెడుతోందని విమర్శించారు. లాభాలొచ్చే 150 రైల్వే రహదారులను కార్పొరేట్లకు ఇచ్చి, లాభాలు రాని గ్రామీణ ప్రాంత రహదారులను మూసేయడం బిజెపి లక్ష్యంగా కన్పిస్తోందన్నారు. ఇప్పటికే రైల్ ఇంజన్లు, తయారీ, వ్యాగన్లు, బోగీలు, చక్రాలు మొదలుగునవి తయారుచేసే 7 సంస్థలకు ప్రయివేటు సంస్థలకు అప్పగించారన్నారు. ఇప్పుడు రైల్వే స్థలాలను ప్రయివేటు పరం చేసే కుట్ర జరుగుతోందన్నారు. రైల్వే ప్రయివేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే మోడీ ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షురాలు ఎం.నాగమణి, నగర కార్యదర్శులు వెంకటనారాయణ, ముత్తుజ, మున్సిపల్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కె.నాగభూషణం, రామ్‌రెడ్డి, ఏటీఎం నాగరాజ్, సురేంద్ర, చీమల ప్రకాష్‌రెడ్డి, ఆదినారాయణ, ఎర్రిస్వామి, జిలాన్ పాల్గొన్నారు.