ఓట్లు

ఓట్ల కోట్లాట.!

       అనంతపురం ప్రతినిధి : నాలుగేళ్లుగా ఓట్ల చేర్పులు, మార్పులపై ఎటువంటి హడావుడి లేదు. కాని ఇది ఎన్నికల సంవత్సరం కావడంతో ఇప్పుడు అందరూ ఓటర్ల జాబితాపై పడ్డారు. రాజకీయపార్టీలు, నేతలు నిశితంగా ఓటర్ల జాబితాలను పరిశీలించుకునే పనిలోపడ్డారు. అటు అధికార వైసిపి, ఇటు ప్రతిపక్ష టిడిపిల మధ్య ఓట్ల లెక్కింపుల్లో సాగుతున్న వివాదాలు తారా స్థాయికే చేరుతున్నాయి. దొంగ ఓట్లు చేరుస్తున్నారు… తమ ఓట్లు తొలగిస్తున్నారంటూ రెండు వైపుల నుంచి విమర్శలు, ప్రతి విమర్శలు చేయడమే కాకుండా ఎన్నికల సంఘాననికి ఫిర్యాదు వరకు వెళ్తున్నాయి. ఓట్ల తొలగింపు, అక్రమాలపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల తొలగింపుపై ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ ఇది వరకే ఫిర్యాదు చేశారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘం నేరుగా క్షేత్ర స్థాయి పర్యటన సైతం చేసింది. ఇందులో ఇద్దరు జిల్లా అధికారులు, ఇద్దరు విఆర్‌ఒలపై వేటు కూడా పడింది. నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లను తొలగిచారన్న దానిపై ఈ చర్యలు తీసుకోవడంతో, ఆ పార్టీ శ్రేణులు మరింతగా ఓటర్ల జాబితాపై దృష్టి సారించాయి. దీనిపై ఇప్పటికీ వైసిపి, టిడిపిల మధ్య మాటలయుద్దం సాగుతూనే ఉన్నాయి. ఓటర్ల జాబితా తయారీలో లోపాలున్నాయని మరోమారు టిడిపి నాయకులు జిల్లా కలెక్టరుతోపాటు, రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఇటీవలనే ఫిర్యాదు చేశారు. దొంగ ఓట్లు ఉన్నాయని, కొన్ని ఉన్నా తొలగిచారని లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేసినా పరిశీలన పూర్తి స్థాయిలో జరపకుండా అలాగే ఉంచారన్నది టిడిపి చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఈ అంశాన్ని ప్రధానంగా ఉరవకొండ నియోజకవర్గంలో పయ్యావుల కేశవ్‌ ఆరోపిస్తున్నారు. దీనికి ప్రతిగా మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రతి ఆరోపణలు పయ్యావుల కేశవ్‌పై చేస్తున్నారు. ఆయనే దొంగ ఓట్లతో ఎమ్మెల్యేగా గెలుపొందారని ఆరోపిస్తున్నారు. అధికారులను బ్లాక్‌మెయిల్‌ చేసి ఆయన అనుకన్ను విధంగా ఓటర్ల జాబితా ఉండే విధంగా చూస్తున్నారని ఆరోపించారు. దీనిపై ఇద్దరి మధ్య మాటల యుద్దం కొనసాగుతూనే ఉంది. ఇదే సమయంలో రాప్తాడుకు సంబందించి కూడా అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. 50 వేల దొంగ ఓట్లను పరిటాల సునీత చేర్చుకున్నారని వైసిపి నాయకులు ఆరోపిస్తున్నారు. అదే సమయలో వైసిపి నాయకులు దొంగ ఓట్లను చేర్చుకుని, టిడిపి ఓట్లను తొలగించారంటూ పరిటాల సునీత ఆరోపిస్తోంది. ఇక అనంతపురం నగరంలోనూ ఇదే రకమైన ఆరోపణలను మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్‌ చౌదరి చేస్తున్నారు. ఇదే విషయంపై ఇటీవల ఆయన ఆర్డీవోకు వినతిపత్రం సైతం అందజేశారు. గుంతకల్లు నియోజకవర్గంలోనూ అక్కడి ఆర్డీవోకు టిడిపి నాయకులు ఫిర్యాదు చేశారు. ఇలా ప్రతి నియోజకవర్గంలోనూ ఓటర్ల జాబితాపై వాడివేడిగా అధికార వైసిపి, ప్రతిపక్ష టిడిపి నాయకుల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నేడు, రేపు ప్రత్యేక శిబారాలను ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలిచ్చే ఫిర్యాదులను, వినతులను స్వీకరించి వాటిని పరిశీలించి సవరించే చర్యలు చేపట్టాలని ఆదేశించింది. కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియను పూర్తి చేయాలని పేర్కొంది. దీంతో ఈ రెండు రోజులు మరింత వాడివేడిగా ఈ ఓటర్ల జాబితా తయారీ సాగనుంది. అత్యధికంగా తొలగింపు ఓట్లు ఉన్నా, ఒకే ఇంటిలో పదికిపైగా ఓట్లు ఉన్నా వాటన్నింటినీ ప్రత్యేకంగ పరిశీలించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశిచింది.

➡️