ఐదేళ్లలో ఇదే అథమం.!

తుంగభద్ర డ్యామ్‌

       అనంతపురం ప్రతినిధి: తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ అనంతపురం జిల్లాకు ప్రధాన సాగునీటి వనరుగా ఉంది. ఈ కాలువకు ఈ ఏడాది గడిచిన ఐదేళ్లలో అతి తక్కువ నీళ్లు వచ్చాయి. సాధారణంగా జనవరి మాసం వరకు వచ్చే నీరు ఈసారి నవంబర్‌లోనే ముగిశాయి. 15.926 టిఎంసిల నీటితోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. 2018-19 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఏటా తుంగభద్ర నీరు ఆశాజనకంగానే జిల్లాకు వస్తూ వచ్చింది. ఈ సంవత్సరం ఎగువ భాగమైన కర్నాటకలోనూ, ఇటు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు సరిగారాని కారణంగా తుంగభద్ర డ్యామ్‌కు నీరు చాల తక్కువగా నీరొచ్చింది. అంతక మునుపు ఏడాది తుంగభద్ర డ్యామ్‌కు వచ్చిన నీరు 598.60 టిఎంసిల నీరు వర్షాల మూలంగా వచ్చింది. ఈ సంవత్సరం జూన్‌ నుంచి ఇప్పటి వరకు కలుపుకున్నా మొత్తం డ్యామ్‌కు చేరిన నీరు కేవలం 113.53 టిఎంసిలు మాత్రమే. డ్యామ్‌కు చేరిన పది సంవత్సరాల సగటుతో పోల్చినా చాలా తక్కువ నీరు వచ్చాయి. పది సంవత్సరాల సగటు తుంగభద్ర డ్యామ్‌కు 280.68 టిఎంసిలుంది. ఈ సంవత్సరం అందులో అంటే 140 టిఎంసిలు కూడా రాలేదు. దీంతో ఈ ప్రభావం అటు తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ, ఇటు తుంగభద్ర దిగువ ప్రధాన కాలువ రెండింటిపైనా పడింది. తుంగభద్ర డ్యామ్‌కు ఈ ఏడాది జూన్‌లో జరిగిన వాటర్‌ రివ్యూ మీటింగ్‌లో వర్షాలు ఈ ఏడాది తగ్గినా కనీసం 170 టిఎంసిల నీరైనా వస్తుందని సీజన్‌కు ముందు ఇంజనీర్లు అంచనా వేశారు. ఆ మేరకు జిల్లాకు వచ్చే తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు 26.828 టిఎంసిల నీరు ఇవ్వొచ్చని అంచనా వేశారు. ప్రధానంగా వర్షాలొచ్చే ఆగస్టు, సెప్టంబర్‌ మాసాల్లో తగినంత వర్షపాతం రాలేదు. దీంతో అక్టోబర్‌ 5వ తేదీన రెండవ వాటర్‌ రివ్యూ కమిటీ మీటింగ్‌లో నీటి లభ్యత ఆధారంగా లెక్కించి తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు 16.097 టిఎంసిలకే పరిమితం చేశారు.

నీటిని తీసుకునేందుకు ఆటంకాలు

         హెచ్‌ఎల్‌సి నీటిని పూర్తి స్థాయిలో తీసుకోవడానికి అనేక ఆటంకాలు, సమస్యలొచ్చాయి. నీరు విడుదలైన తొలి రోజుల్లో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ గండ్లుపడటంతో మధ్యలో ఆపాల్సి వచ్చింది. ఆ రకంగా ఆపిఆపి తీసుకుంటూ పోవడంతో ఈ ఏడాది 15.926 టిఎంసిలతోనే నీటిని సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ డ్యామ్‌లలో నీటి మట్టం 15 టిఎంసిలకు తగ్గిపోవడంతో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు నీరు తుంగభద్ర డ్యామ్‌లో అందే పరిస్థితి లేదు. దీంతో జిల్లాకు రావాల్సిన నీరు ఆగిపోయింది.

ఐదేళ్లలో అథమం..!

     గడిచిన ఐదేళ్లలో చూసినప్పుడు తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు నీరు తక్కువగా ఈసారి వచ్చింది. 2016-17 సంవత్సరంలో తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువకు వచ్చిన నీరు 10.731 టిఎంసిలు మాత్రమే. ఆ తరువాత 2017-18 సంవత్సరంలో 17.476 టిఎంసిలొచ్చాయి. 2018-19 సంవత్సరంలో 23.149 టిఎంసిలు, 2019-20 సంవత్సరంలో 27,134 టిఎంసిలు నీరొచ్చింది. గతేడాది అంతకు మునుపు ఏడాది అయితే గరిష్టంగా నీరొచ్చింది. 2020-21 సంవత్సరంలో 36.50 టిఎంసిలు రాగా, 2022-23 సంవత్సరంలో 36.50 టిఎంసిల నీరొచ్చింది. ఈ రెండు సంవత్సరాల్లోనూ జిల్లాలోనూ మంచి వర్షాలు రావడంతో ఎప్పుడూలేనంతగా జిల్లాలోని అన్ని ప్రాజెక్టులు పొంగి ప్రవహించాయి. సుమారు వంద టిఎంసిల వరకు నీరు నదిలో వృథాగా పోయింది. ఈ ఏడాది వర్షాల్లేకపోవడంతో ప్రాజెక్టుల్లోనూ నీరులేక వెళవెళపోతున్నాయి. ఆయకట్టు రైతుల్లోనూ ఆందోళన నెలకొంది.

➡️