ఈఎస్‌ఐ ఆసుపత్రికి జాగా దొరకలేదు..!

Nov 23,2023 21:49
ఈఎస్‌ఐ ఆసుపత్రికి జాగా దొరకలేదు..!

ఈఎస్‌ఐ వైద్యం

      అనంతపురం ప్రతినిధి : ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏడాదిన్నరగా ఈఎస్‌ఐ ఆసుపత్రి నిర్మాణానికి జాగా దొరకలేదు. ఆసుపత్రి మంజూరై 18 మాసాలు పూర్తయినా స్థలం దొరక్క నిర్మాణాలు ప్రారంభమవలేదు. మరోవైపు రెఫరల్‌ ఆసుపత్రులు కూడా స్థానికంగా లేకపోవడంతో కార్మికులు, వారి కుటుంబాలు అనారోగ్యం బారినపడితే లక్షలు ఖర్చు పెట్టుకుని వైద్య సేవలు పొందాల్సిన దుస్థితి నెలకొంది. ఆసుపత్రి నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఖరారు చేయడంలోగానీ, రెఫరల్‌ ఆసుపత్రులను కేటాయించే అంశంపైగాని పాలకులు పట్టించుకుంటున్న దాఖలాలు లేవు. ఏడాదిన్నర క్రితం ఈఎస్‌ఐ ఆసుపత్రి మంజూరు 2022 మార్చిలో రాష్ట్ర వ్యాప్తంగా ఏడు ప్రాంతాల్లో ఆసుపత్రులను మంజూరు చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెనుకొండ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని ప్రాథమికంగా నిర్ధారించారు. కాని ఇప్పటికీ స్థల నిర్థారణ పూర్తవలేదు. రెండు పర్యాయాలు కేంద్ర ఈఎస్‌ఐ అధికార బృందం పర్యటించి కూడా వెళ్లింది. రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి చొరవ లేకపోవడంతో ఈ ఆసుపత్రి ఎక్కడ ఏర్పాటు చేయాలన్న దానిపై ఇప్పటికీ స్పష్టత రాలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో మొత్తం అధికారపార్టీకి చెందిన ప్రజాప్రతినిధులే అందరూ ఉన్నప్పటికీ దీనిపై దృష్టి సారించిన దాఖలాల్లేవు. హిందూపురం పార్లమెంట్‌ సభ్యులుగానున్న గోరంట్ల మాధవ్‌ సైతం దీని ఏర్పాటుకు కృషి చేయాలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. డిస్పెన్షరీల్లో ప్రాథమిక చికిత్సతోనే సరి.. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇఎస్‌ఐ పరిధిలో 40వేల మందికిపైగా కార్మికులున్నారు. యజమాన్యాల తరుపున ఈఎస్‌ఐకు కొంత మొత్తాన్ని రెగ్యులర్‌గా చెల్లిస్తున్నారు. వీరికి కార్మికశాఖ ద్వారా ఈఎస్‌ఐ నుంచి అవసరమైన వైద్య సేవలందాల్సి ఉంది. ఇందుకుగానూ ఉమ్మడి అనంతపురం జిల్లాలో అనంతపురం, హిందూపురంలో రెండు డిస్ఫెన్షరీలున్నాయి. అక్కడ ప్రాథమిక వైద్యం వరకు అందించడానికి వీలుంది. ఏదైనా క్లిష్టతరమైన ఆరోగ్య సమస్యలొస్తే మల్టీ స్పెషాలిటీ వైద్య సేవలందించాల్సి ఉంటుంది. దీనికి గతంలో రెండు ప్రయివేటు ఆసుపత్రులకు రెఫర్‌ చేసేవారు. ఇప్పుడు ఆ రెఫరల్‌ ఆసుపత్రులను కూడా తొలగించారు. ఏదైనా ఆరోగ్య సమస్య తీవ్రంగా ఉంటే తిరుపతికెళ్లాల్సి ఉంటుంది. అక్కడా పరీక్షించి మెరుగై వైద్యమందివ్వాలంటే అక్కడి నుంచి వారు రెఫర్‌ చేయాల్సి ఉంటుంది. దీంతో కార్మికులకు ఈఎస్‌ఐ ద్వారా వైద్యమందటం ఇబ్బందికరంగా మారింది. కనీసం రెఫరల్‌ ఆసుపత్రులను అయినా స్థానికంగా ఉండే విధంగా చూడాలని కోరుతున్నారు.

ఈఎస్‌ఐ వైద్యసేవలందే విధంగా చర్యలు తీసుకోవాలి

నాగేంద్ర కుమార్‌ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి.

ఈఎస్‌ఐ ఆసుపత్రుల ఏర్పాటుకు సాధ్యమైనంత త్వరగా స్థలం కేటాయించి, నిర్మాణం చేపట్టాలి. అంత వరకు స్థానికంగా అవసరమైన వైద్యసేవలందించేందుకు వీలుగా రెఫరల్‌ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలి. కార్మికులకు ఏదైనా సమస్యలొస్తే వైద్యానికి అధికంగా ఖర్చులై అప్పులపాలయ్యే పరిస్థితులున్నాయి. కావున ప్రభుత్వం చొరవచూపి ఇఎస్‌ఐల ద్వారా మెరుగైన వైద్యసేవలందించే విధంగా చర్యలు తీసుకోవాలి.

➡️