జిల్లాలో ప్రతి ధాన్యపు గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, కావున రైతులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా పౌరసరఫరాల మేనేజర్ ఎండి నాయక్ చెప్పారు. ఈ ఏడాది సుమారు 3.20లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేసేందుకు లక్ష్యంగా పెట్టుకున్నామని స్పష్టం చేశారు. ఈ ఏడాది చెల్లింపులు కూడా సకాలంలోనే జరుగుతాయని ధీమా వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా 180 ఆర్‌బికెల పరిధిలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఇప్పటికే సిబ్బంది నియామకం పూర్తయ్యిందని, కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన వస్తు సామగ్రి కూడా సిద్ధం చేశామని స్పష్టం చేశారు. రవాణా, కూలీల ఛార్జీలు ప్రభుత్వమే భరిస్తుందన్నారు. రైతులకు ఇబ్బందులు ఎదురైతే రైతులు నిర్భయంగా ఫిర్యాదులు చేయొచ్చన్నారు. మరిన్ని వివరాలను ‘ప్రజాశక్తి’ ముఖాముఖికి తెలిపారు. వివరాలు ఆయన మాటల్లోనే….
– ప్రజాశక్తి, విజయనగరం : ప్రతినిధి ఈ ఏడాది ధాన్యం కొనుగోలు లక్ష్యం ఎంత? ఈ ఏడాది 3.20లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. గత ఏడాది 2.30లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేశాం. ఈ ఏడాది దిగుబడి పెరుగుతుందని వ్యవసాయ శాఖ ఆశాభావం వ్యక్తం చేసిన నేపథ్యంలో గత ఏడాది కన్నా లక్ష్యాన్ని పెంచుకున్నాం. ఎన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు? జిల్లా వ్యాప్తంగా 185 ఆర్‌బికెల ద్వారా ధాన్యం కొనుగోలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఏడాది రైతుల బయోమెట్రిక్ కూడా సేకరిస్తున్నాం. ఇప్పటికే ఆయా కేంద్రాల్లో కొనుగోలుకు అవసరమైన అన్ని రకాల సామాగ్రి సిద్ధంగా ఉంది. ఈ నెలాఖరులోపు అన్ని చోట్ల కొనుగోళ్లు ప్రారంభమౌతాయి. సిబ్బంది నియామకమైందా?ప్రతి కొనుగోలు కేంద్రంలో ముగ్గురు చొప్పున సిబ్బందిని నియమించాం. వీరితో పాటు అన్ని కేంద్రాలకు ఇద్దరు చొప్పున కస్టోడియన్ ఆఫీసర్లను నియమించాం. ముఖ్యంగా ప్రచార సామగ్రి, జిపిఎస్ డివైజర్స్, బయోమెట్రిక్ వివైజర్స్, ఎలక్ట్రానిక్ కాటాలు, గోనె సంచులు ఆర్‌బికెలకు చేరాయి. ఎక్కడైనా ఆటకం ఉంటే, వెంటనే తగు చర్యలు తీసుకుంటాం. ట్రాన్స్‌పోర్టు, లేబర్ ఛార్జీలు చెల్లింపు ఎలా ఉంటుంది? ధాన్యం ట్రాన్స్‌పోర్ట్, లేబర్ ఛార్జీలతోపాటు గోనె సంచుల బాధ్యత కూడా ప్రభుత్వానిదే. ఒకవేళ ఈ మూడింటి బాధ్యత రైతులు చూసుకుంటే వాటికి సంబంధించిన సొమ్ము రైతులు పొందవచ్చు. కేజీకి రూ.3.39 ట్రాన్స్‌పోర్టు ఛార్జీ, 40కేజీల బస్తాకు రూ.17.17 చొప్పున లేబరు ఛార్జీ ప్రభుత్వమే 21రోజుల వ్యవధిలో చెల్లిస్తుంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న కొనుగోలు కేంద్రాలకు 16వేల గోనె సంచులు పంపాము. ఎన్ని మిల్లులకు తరలించనున్నారు? ధాన్యం తరలింపు విషయంలో గతంలో అమలు చేసిన జంబ్లింగ్ విధానం ప్రభుత్వం రద్దుచేసింది. జిల్లా వ్యాప్తంగా 84 రైస్ మిల్లులు ఉన్నాయి. వీటి ద్వారా ధాన్యం కొనుగోలు నిమిత్తం రూ.40 కోట్ల వరకు బ్యాంకు గ్యారెంటీలు రావాల్సి ఉంటుంది. సంబంధిత మండల పరిధిలోని మిల్లులకు మాత్రమే పంపుతాం. మిల్లర్లు బ్యాంకు గ్యారెంటీలు ఇవ్వలేకపోతే పక్క మండలానికి పంపేందుకు అవకాశం ఉంది. ఈ ఏడాది ధాన్యం ధర ఎలా ఉంది? ‘ఎ’ గ్రేడ్ ధాన్యం రూ.2,203, సాధారణ రకం రూ.2,060 చొప్పున కొనుగోలు చేస్తున్నాం. గత ఏడాదితో పోలిస్తే కేజీపై రూ.140 ధర పెరిగింది. నాణ్యతా ప్రమాణాలు కొనుగోలు కేంద్రం వద్దే పరిశీలిస్తారు. ఎగ్రేడ్ లేదా సాధారణ రకాల మద్ధతు ధర పొందడానికి గరిష్టంగా 4శాతానికి మించి ఉండరాదు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది ఎదురైనా తమకు ఫిర్యాదు చేయవచ్చు. చిరుధాన్యాలేమైనా కొనుగోలు చేస్తున్నారా? ఔను…! చిరుధాన్యాలు కొనుగోలు చేస్తున్నాం. జిల్లాల్లో రాగులు మాత్రమే ఎక్కువగా సాగవుతున్నాయి. ఈ నేపథ్యంలో వీటిని 10 మండలాల్లో (ముఖ్యంగా కురుపాం, గుమ్మలక్ష్మీపురం, కొమరాడ, పాచిపెంట, మక్కువ, సాలూరు, సీతంపేట) కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించాం. మొత్తం 49ఆర్‌బికెల ద్వారా వీటిని కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేశాం. క్వింటా రూ.3,846 చొప్పున ప్రభుత్వం ధర నిర్ణయించింది.