2, 3న ప్రత్యేక ఓటరు నమోదు

Nov 29,2023 21:41

ప్రజాశక్తి-పార్వతీపురం :డిసెంబరు 2, 3 తేదీల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్‌ నిశాంత్‌కుమార్‌ తెలిపారు. వచ్చే జనవరి ఒకటో తేదికి 18 ఏళ్లు పూర్తయ్యే యువతీ యువకులను, ఇంతవరకు ఓటరుగా నమోదు కానివారిని ఓటరుగా నమోదు చేయించాలని రాజకీయ పార్టీల ప్రతినిధులను కోరారు. కలెక్టర్‌ కార్యాలయ సమావేశ మందిరంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో బుధవారం సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముసాయిదా ఓటరు జాబితా ప్రకారం జిల్లాలో 7,70,525 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. వారిలో పురుషులు 3,76,220, స్త్రీలు 3,94,240, థర్డ్‌ జెండర్‌ 65 మంది ఉన్నారని తెలిపారు. ఏప్రిల్‌ 15వ తేది నుండి ఇప్పటివరకు 26,586 మందిని ఓటరు జాబితాలో చేర్చడం, 27789 తొలగింపులు చేయగా, 86930 సవరణలు చేసినట్లు వివరించారు. క్లైములు, అభ్యంతరాలను డిసెంబరు 9 వరకు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. డిసెంబరు 26 నాటికి వాటిని పరిష్కరిస్తారని, 2024 జనవరి 5న తుది జాబితా ప్రచురణ సిద్ధం అవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఓటరు జాబితాలో తెలియజేసిన అభ్యంతరాలపై విచారణ చేపట్టి, చర్యలు తీసుకుంటామన్నారు. ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం రోజుల్లో పోలింగ్‌ కేంద్రాల వద్ద బూత్‌ స్థాయి అధికారులు ఉంటారన్నారు. బూత్‌ స్థాయి అధికారుల వద్ద ఫారం – 6, 7, 8 అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఒకేసారి పెద్ద ఎత్తున ఓటరు నమోదు దరఖాస్తులు స్వీకరించడం జరగదని స్పష్టం చేశారు. ఎలక్ట్రానిక్‌ ఓటింగు మిషన్లపై ప్రజలకు అవగాహన కోసం ప్రత్యేకంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మొబైల్‌ ప్రదర్శన వ్యాన్‌ను ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతి మొబైల్‌ ప్రదర్శన వ్యాన్‌తోపాటు ఒక అధికారిని నియమించి, రూట్‌ చార్ట్‌ వివరాలను ముందుగా తెలియజేసి ఈ కార్యక్రమానికి ప్రభుత్వపరంగా ప్రచారం కల్పిస్తున్నట్లు తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో ప్రజలను పాల్గొనేలా ప్రోత్సహించాలన్నారు. మరణించిన, శాశ్వతంగా వలసవెళ్లిన, అడ్రసు గుర్తింపబడని ఓట్లను తొలగించాలని టిడిపి ప్రతినిధులు జిల్లా కలెక్టరుకు వినతిపత్రం అందజేశారు. ఈ సమావేశానికి వైసిపి ప్రతినిధి వి.శ్రీనివాసరావు, టిడిపి ప్రతినిధులు జి.సంద్యారాణి, డి.జగదీష్‌, బి.విజయచంద్ర, టి.జగదీశ్వరి, జి.వెంకటనాయుడు, బిజెపి ప్రతినిధి ఎ.పేర్రాజు, లోక్‌సత్తా ప్రతినిధి ఎ.ప్రభాకరరావు, జనసేన ప్రతినిధి పి.శీనివాసరావు, బిఎస్‌పి ప్రతినిధి టి.వెంకటరావు పాల్గొన్నారు.సీతంపేట : బిఎల్‌ఒలు రిజిష్టర్‌ను తప్పనిసరిగా పూర్తి చేయాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. బుధవారం నాలుగు మండలాల బిఎల్‌ఒలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ ఓటరు జాబితాలో తప్పులు లేకుండా చూసుకోవాలన్నారు. ఓటు తొలగించేటప్పుడు నిబంధనల ప్రకారం తొలగించాలన్నారు. వలస వెళ్లిన వారి ఓట్ల విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో తహశీల్దార్లు నరసింహమూర్తి, అప్పారావు, డిటిలు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.

➡️