ప్రజాశక్తి-పాచిపెంట : ఉత్తరాంధ్ర జిల్లాల్లో వరి కోతకు వారం రోజుల ముందు నేలలో ఉన్న తేమను వినియోగించుకుని పంట పండించడానికి అపరాలు చల్లుతారు. కానీ, వరి కొయ్యలలో చోడి సాగుకు పి.కోనవలస రైతు భరోసా కేంద్రం పరిధిలో ఉన్న చెరుకుపల్లి గ్రామంలో శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా రైతులకు ఉచితంగా విత్తనాలను మండల వ్యవసాయ అధికారి కె.తిరుపతిరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మన జిల్లాలో వరి కొయ్యలలో చోడి పంట సాగు ఇదే ప్రథమమని తెలిపారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూమిలో తేమ శాతం చాలా తక్కువగా ఉందన్నారు. తక్కువ నీటి పదునుతో జిల్లాలోనే ప్రథమంగా వరి కొయ్యలలో చోడి పంట సాగుకు ముందుకు వచ్చినందుకు రైతులకు అభినందనలు తెలిపారు. భూమిని ఖాళీగా ఉంచకూడదని, 365 రోజులపాటు ఏదో ఒక పంటతో కప్పి ఉంచుకోవాలని సూచించారు. అలా అయితే పోషకాలు బయటకు పోకుండా ఉంటాయన్నారు. ఈ సంవత్సరం రబీ సీజన్లో చిరుధాన్యాల సాగును పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని చెప్పారు. ప్రభుత్వం మంచి మద్దతు ధరను కల్పించిందన్నారు. చిరుధాన్యాల సాగుకు రైతులు ముందుకు రావాలని తెలిపారు. అనంతరం గ్రామ వ్యవసాయ సహాయకులు నాగమణితో కలిసి రైతులకు విత్తనాలను పంపిణీ చేశారు.