ప్రజాశక్తి – సాలూరు రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబరు 8 నుంచి తలపెట్టిన నిరవధిక సమ్మెను అంగన్వాడీలంతా పాల్గొని జయప్రదం చేయాలని, ఈ సమ్మెకు అన్ని వర్గాల ప్రజల మద్దతు నిలవాలని ఎపిఅంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.ఉమామహేశ్వరి అన్నారు. మంగళవారం స్థానిక ఐసిడిఎస్ రూరల్ కార్యాలయ ఆవరణలో సాలూరు రూరల్ గ్రామీణ ప్రాంతాల వర్కర్ల సమావేశంలో ఆమె మాట్లాడారు. అంగన్వాడీలకు అధికారం వస్తే తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారని, నేటికీ అమలు చేయలేదని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు చేయాల్సి ఉన్నా చేయడం లేదని అన్నారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ రూ.ఐదు లక్షలు, జీతంలో సగం పెన్షన్ ఇవ్వాలని, మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలని, వర్కర్‌తో సమానంగా జీతాలు ఇవ్వాలని, హెల్పర్ల వయోపరిమితి 50 ఏళ్లకు పెంచాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేసి, యాప్ కుదించాలని డిమాండ్ చేశారు. సర్వీస్‌లో ఉండి చనిపోయిన వారికి వారి కుటుంబంలో ఉద్యోగం ఇవ్వాలని, లబ్ధిదారులకు నాణ్యమైన ఆహారాన్ని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వై నాయుడు మాట్లాడుతూ అంగన్వాడీల న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం అన్ని వర్గాలు అండగా నిలవాలని, సిఐటియు కూడా అండగా నిలుస్తుందని తెలిపారు. కార్యక్రమంలో మండల అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ అధ్యక్ష, కార్యదర్శులు శశికళ, హారిక నారాయణమ్మ, సెక్టార్ నాయకులు పార్వతి, అరుణ, గౌరి, సుభద్ర, తిరుపతమ్మ, రాజమ్మ, సుజాత, మరియమ్మ, పుష్ప, ఉత్తరమ్మ, తదితరులు పాల్గొన్నారు.బలిజిపేట : డిసెంబర్ 8నుంచి నిరవధిక సమ్మెకు సంపూర్ణ మద్దతు తెలపాలని జెడ్‌పిటిసి సభ్యులు అలజంగి రవికుమార్‌కు సమ్మె నోటీస్ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి గంట జ్యోతిలక్ష్మి, ప్రాజెక్టు నాయకులు కె.దాలమ్మ అందజేశారు. ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, టిఎ బిల్లులు, ఇతర బకాయిలు వెంటనే చెల్లించాలని, ఎఫ్‌ఆర్‌ఎస్‌ను రద్దు చేయాలని తదితర సమస్యపై డిసెంబర్ 8న తలపెట్టిన నిరవధిక సమ్మెకు మద్దతు తెలపాలని కోరారు. కార్యక్రమంలో కార్యకర్తలు, సెక్టార్ లీడర్లు పాల్గొన్నారు.కొమరాడ : సమస్యల పరిష్కారం కోరుతూ డిసెంబర్ 8న రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీలు చేపడుతున్న నిరవధిక సమ్మెకు మద్దతు కోరుతూ మండలంలోని ప్రజాప్రతినిధులకు గ్రామ పెద్దలకు వినతిపత్రం అందజేశారు. ఇందులో భాగంగా సివిని సర్పంచ్ బోనెల పుష్పమ్మకు, గ్రామ పెద్ద పొట్నూరు వెంకటనాయుడుకు, వైస్ ప్రెసిడెంట్ అధికారి సురేష్‌కు, వాలంటీర్లకు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ యూనియన్ నాయకులు రాధారాణి, సునీత, సిఐటియు మండల నాయకులు కొల్లి సాంబమూర్తి, కార్యకర్తలు పాల్గొన్నారు.