సమగ్రాభివృద్ధిపై సదస్సును జయప్రదం చేయండి

ప్రజాశక్తి – సాలూరు: జిల్లా సమగ్రాభివృద్ధిపై డిసెంబర్‌ 17న పార్వతీపురంలో నిర్వహించనున్న సదస్సును జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి రెడ్డి వేణు కోరారు. మంగళవారం ఆయన స్థానిక సిఐటియు కార్యాలయంలో సిపిఎం మండల నాయకులతో కలిసి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఏర్పడి ఏడాది దాటినా ఇంతవరకూ ఏ విధమైన ప్రణాళిక లేదని చెప్పారు. జిల్లాలో సాగునీరు, తాగునీరు లేని గ్రామాలు చాలా ఉన్నాయన్నారు. చెక్‌ డామ్‌లు, మినీ రిజర్వాయర్లు నిర్మించాలని డిమాండ్‌ చేశారు. గిరిజన యువతకు ఉపాధి కోసం ప్రత్యేక ప్రణాళిక తయారు చేయాలన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరారు. గిరిజనుల అటవీ ఉత్పత్తులకు మార్కెటింగ్‌ సౌకర్యం కల్పించా లని కోరారు. మారుమూల గిరిజన గ్రామాలకు ఇప్పటికీ విద్య, వైద్యం అందని ద్రాక్షలా ఉన్నాయని చెప్పారు. గిరిశిఖర గ్రామాల గిరిజను లకు డోలీ మోతలు తప్పడం లేదన్నారు. ఈ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ జిల్లా సమగ్రాభివృద్ధిపై నిర్వహించనున్న సదస్సును జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సిపిఎం మండల కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు, ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా గౌరవాధ్యక్షులు సీదరపు అప్పారావు, మండల అధ్యక్షులు గెమ్మెల జానకీరావు, కార్యదర్శి వంతల సుందరరావు పాల్గొన్నారు.

➡️