ప్రజాశక్తి-సాలూరుసాలూరు : ఏరియా ఆసుపత్రిలో సకాలంలో వైద్యం అందక ఓ మహిళ మృతి చెందింది. బుధవారం తెల్లవారు జామున 4.50 గంటలకు పట్టణంలోని దాసరి వీధికి నీలాపు నాగమ్మ (49)ని ఆమె కుటుంబ సభ్యులు ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. నాగమ్మ ఆయాసంతో బాధపడుతోందని ఆసుపత్రిలో చేర్పించారు. ఆ సమయంలో డ్యూటీ డాక్టర్ లేకపోవడంతో నర్సింగ్ సిబ్బంది వైద్యం అందించారు. సెలైన్ బాటిల్ ఎక్కించారు. నాగమ్మని ముందు జనరల్ వార్డులో చేర్చారు. సిబ్బంది చేసిన వైద్యం ఫలించకపోవడంతో రౌండ్‌కి వచ్చిన డాక్టర్ తిరుమలాదేవి.. నాగమ్మను క్యాజువాలిటీ వార్డుకు తరలించాలని సూచించారు. అక్కడ కూడా ఉదయం 9.15 గంటలకు డాక్టర్ శాంతిప్రియ వైద్యం ప్రారంభించారు. అప్పటికే సరైన వైద్యం అందకపోవడంతో డాక్టర్ శాంతిప్రియ చేసిన చికిత్సకు నాగమ్మ ఆరోగ్యం మెరుగు పడలేదు. దీంతో ఉదయం పది గంటల సమయంలో ఆమె మృతి చెందారని డాక్టర్ శాంతిప్రియ నిర్ధారించారు. దీంతో మృతురాలి బంధువుల కోపం కట్టలు తెంచుకుంది. వైద్యం అందించిన డాక్టర్ శాంతిప్రియపై నాగమ్మ కుటుంబ సభ్యుల ఆగ్రహంతో ఊగిపోయారు. ఆ సమయంలో అక్కడ ఉన్న ఎంఎన్‌ఒ మోహన్ వంశీ, ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ ఎస్.వెంకటరమణపై నాగమ్మ కుటుంబ సభ్యులు దాడికి దిగారు. దీంతో వెంటనే వైద్య సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. టౌన్ ఎస్‌ఐలు నర్సింహమూర్తి, భాస్కరరావు అక్కడకు చేరుకుని ఉద్రిక్త పరిస్థితులను సద్దుమణిగేలా చేశారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల నాగమ్మ మృతి చెందిందని పోలీసులతో వాదించారు. బాద్యులైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 5 గంటలు ఆలస్యంగా వైద్యం ప్రారంభించారని, అందువల్లే నాగమ్మ మరణించారని ఆమె బంధువు లక్ష్మి విలేకరులకు చెప్పారు. ఏరియా ఆసుపత్రిలో డ్యూటీ డాక్టర్ లేకపోవడమేమిటని ప్రశ్నించారు. నాగమ్మని ఆసుపత్రికి తీసుకొచ్చిన వెంటనే సరైన వైద్యం అందిస్తే బతికి ఉండేదని బంధువులు వాపోయారు. ఉదయం 9.15కి వైద్యం ప్రారంభించా- డాక్టర్ శాంతి ప్రియ ఆసుపత్రిలో ఒపి విభాగం నుంచి ఉదయం 9.15 గంటలకు నాగమ్మకు చికిత్స ప్రారంభించాను. ఫ్లూయిడ్స్ ఇచ్చాం. నెబ్యులైజర్ పెట్టాం. ఆమెని బతికించడానికి శాయశక్తులా కృషి చేశాను. ఒక దశలో మృతురాలి బంధువులు నాపై దాడికి ప్రయత్నించారు. ఆవేశంతో నర్సింగ్ సిబ్బందిపై దాడికి దిగారు.డ్యూటీ డాక్టర్ ఎక్కడికెళ్లారు? ఏరియా ఆసుపత్రి.. వంద పడకల స్థాయికి రూపాంతరం చెందిన పూర్తి స్థాయిలో వైద్య సిబ్బంది, ఇతర విభాగాలకు సిబ్బందిని నియమించారు. 24 గంటలూ వైద్య సేవలు, అత్యవసర పరిస్థితుల్లోనూ వైద్యం అందేలా ఇక్కడ సౌకర్యాలు కల్పించారు. డ్యూటీ డాక్టర్ ఉదయం 9 గంటల నుంచి మరుసటిరోజు ఉదయం 9 గంటల వరకు విధినిర్వహణలో ఉండాలి. తరువాతి రోజు వీరికి సెలవు. ఇక్కడ డ్యూటీ డాక్టర్ సాయి బుధవారం తెల్లవారు జామున ఉదయం 4.50 గంటలకు నాగమ్మను తీసుకొచ్చే సమయానికి లేరని మృతురాలి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆయన ఉంటే నాగమ్మకు సకాలంలో వైద్యం అందేది. నాగమ్మను ఆసుపత్రికి తీసుకొచ్చిన సమయానికి డ్యూటీ డాక్టర్ సాయి లేరనే విషయాన్ని మిగిలిన వైద్యులు మరుగున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. డ్యూటీలో ఉన్నారనే విషయాన్ని కరాఖండిగా ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ డాక్టర్ గోపాలరావు కూడా చెప్పలేక నీళ్లు నములుతున్న పరిస్థితి కనిపించింది.వైద్యం అందించాం- ఇన్‌ఛార్జి సూపరింటెండెంట్ గోపాలరావు నాగమ్మకు సకాలంలో వైద్యం అందించాం. ఆమె పరిస్థితి విషమంగా ఉండడంతో జనరల్ వార్డు నుంచి క్యాజువాలిటీకి తరలించాం. డాక్టర్ శాంతి ప్రియ వైద్యం చేశారు.చర్యలు తీసుకోవాలి- సూపరింటెండెంట్ డాక్టర్ రత్నకుమారి ఏరియా ఆసుపత్రిలో బుధవారం విధినిర్వహణలో వున్న వైద్య సిబ్బందిపై దాడికి పాల్పడిన నీలాపు నాగమ్మ బంధువులపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాం. నాగమ్మకు అందించిన వైద్యం, దాడికి పాల్పడిన సిసి ఫుటేజీ అందజేశాం.