సంక్షేమ హాస్టళ్లను బలోపేతం చేయాలి

ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్‌ : సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల పరిస్థితి చాలా అధ్వాన్నంగా ఉందని, కనీసం పాలక ప్రభుత్వాలు వసతిగృహల్లో మౌలిక సదుపాయాలు కల్పించకపోవడం అన్యాయమని జనసేన పట్టణ నాయకులు వి.దాలినాయుడు, గిరిజన సంక్షేమ సంఘం కన్వీనర్‌ పి.రంజిత్‌ కుమార్‌ విమర్శించారు. జిల్లాలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ తలపెట్టిన నిరసన దీక్షలు ఆదివారానికి మూడో రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్బంగా జనసేన, గిరిజన సంక్షేమ సంఘం నాయకులు దీక్షా శిబిరానికి వచ్చి విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్బంగా జనసేన నాయకులు దాలినాయుడు మాట్లాడుతూ మన్యం జిల్లా అనే పెట్టి, జిల్లా వాసులను అడవుల్లో ఉన్న జంతువుల్లా ప్రభుత్వ వర్గాలు చూస్తున్నాయని, ఇది దారుణమని ఖండిచారు. ఎన్నో ఏళ్లుగా విద్యార్థులు మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు పడుతుంటే అధికారులకు పట్టడం లేదాని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలో గల హాస్టళ్లలో ఈనాటికి మరుగుదొడ్లు లేక అరుబయటకు విద్యార్థిని, విద్యార్థులు పోతుండడం చాలా అవమానకరమని, వెంటనే అధికారులు స్పందించి మరుగుదొడ్లు, మౌలికసదుపాయాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జిల్లా విద్యారంగ అభివృద్ధికి ఎస్‌ఎఫ్‌ఐ చేస్తున్న పోరాటం చాలా అద్భుతమైందని, భవిష్యత్‌లో ఎస్‌ఎఫ్‌ఐ పోరాటాలకు జనసేన అన్నివేళలా తోడ్పాటును అందిస్తుందని తెలిపారు. అనంతరం గిరిజన సంక్షేమ సంఘం జిల్లా కన్వీనర్‌ పి. రంజిత్‌కుమార్‌ మాట్లాడుతూ గిరిజనుల పోరాటం పార్వతీపురంకు వెన్నుదన్నుగా నిలించందని, అటువంటి పోరాట స్పూర్తితో ఉద్యమాని ఉధృతం చేయాలని అన్నారు. సంక్షేమ హాస్టళ్లకు ప్రభుత్వం అరకొర నిధులతో అభివృద్ధి భూతం చూపెడుతుందని, వెంటనే బకాయి నిధులను కేటాయించి, హాస్టళ్ల అభివృద్ధికి కృషి చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి పి. రాజశేఖర్‌, జిల్లా ఉపాధ్యక్షులు కె. రాజు, కమిటీ సభ్యులు సురేష్‌, ధనుంజయరావు, ముఖేష్‌, శ్రావణ్‌, జనసేన కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.

➡️