ప్రజాశక్తి-సాలూరు : నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేసి వదిలేయడం టిడిపికే చెల్లిందని మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వల ఈశ్వరమ్మ, వైస్‌చైర్మన్ వంగపండు అప్పలనాయుడు, వైసిపి ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, జెసిఎస్ కన్వీనర్ గిరి రఘు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గొర్లి జగన్మోహన్‌రావు అన్నారు. సోమవారం వారు టిడ్కో గృహ సముదాయం ఆవరణలో విలేకరుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో టిడిపి ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధి పనులపై చర్చకు రావాలని డిప్యూటీ సిఎం రాజన్నదొర అనేక సార్లు సవాల్ విసిరారని చెప్పారు. దానిపై టిడిపి నాయకులు ఏనాడూ స్పందించలేదని తెలిపారు. టిడ్కో ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది టిడిపి హయాంలోనేనని గుర్తుచేశారు. గత ప్రభుత్వ హయాంలో టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించకుండా వారిని అప్పులపాలు చేశారని చెప్పారు. చంద్రబాబు నిర్వాకం వల్ల ఇళ్ళలో దిగకుండానే లబ్దిదారులు రుణాలు వాయిదాల రూపంలో చెల్లిస్తున్నారని గుర్తు చేశారు. వైసిపి ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రూపాయికే టిడ్కో ఇళ్ళ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జరుగుతున్నదని చెప్పారు. పేదలను నమ్మించి మోసం చేయడం సిఎం జగన్‌మోహన్‌రెడ్డికి చేతకాదన్నారు. పట్టణంలో వంద పడకల ఆసుపత్రికి టిడిపి ప్రభుత్వం శంకుస్థాపన చేసి వదిలేస్తే తమ ప్రభుత్వం శరవేగంగా నిర్మిస్తోందని చెప్పారు. నియోజకవరంలో డిప్యూటీ సిఎం రాజన్నదొర హయాంలో జరిగిన అభివృద్ధి పనులు రోడ్లు, వంతెనల రూపంలో కనిపిస్తున్నాయన్నారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల చేయడం వల్లనే రాజన్నదొరను వరుసగా మూడు సార్లు ప్రజలు గెలిపించారని చెప్పారు. వాస్తవాలు తెలుసుకుని టిడిపి నాయకులు ఆరోపణలు చేయాలని హితవుపలికారు. సమావేశంలో కౌన్సిలర్లు గొర్లి వెంకటరమణ, పప్పల లక్ష్మణరావు, గుల్లిపల్లి నాగేశ్వరరావు, వైసిపి నాయకులు పున్నాన మోహనరావు, పిరిడి రామకృష్ణ, హరిబాలాజి, గిరి చిన్ని, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.