ప్రజాశక్తి-సాలూరు: రానున్న ఎన్నికల్లో వైసిపిని మళ్లీ అధికారంలోకి తీసుకురాకపోతే దళితులు, గిరిజనులు నష్టపోతారని డిప్యూటీ సిఎం రాజన్నదొర అన్నారు. సొమవారం మండలంలోని దండిగాం గ్రామంలో సారిక, ములక్కాయవలస గిరిజనులకు భూపట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. సర్పంచ్ గొర్లి సత్యవతి అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో డిప్యూటీ సిఎం మాట్లాడుతూ గిరిజనులు, దళితులకు సమాజంలో గౌరవం దక్కాలనే లక్ష్యంతో భూమిపై హక్కు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. 20 ఏళ్లుగా డి-పట్టా భూమి సాగులో ఉన్న దళిత, గిరిజనులకు సంపూర్ణ హక్కు కల్పిస్తున్నట్లు చెప్పారు. దీని వల్ల సాగుదారులకు ఆ భూమిపై రుణాలు పొందే అవకాశం, విక్రయించుకునే హక్కు కలుగుతాయని తెలిపారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి పనులపై చర్చకు రావాలని అనేక సార్లు పిలిచినా టిడిపి నాయకులు మొహం చాటేశారని చెప్పారు. ఇప్పుడు సిగ్గు లేకుండా విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కొటియాపై ఆచితూచి అడుగులు ఒడిశా ప్రభుత్వంతో నెలకొన్న కొన్ని వివాదాల కారణంగా కొటియా గ్రామాల విషయంలో ఎపి ప్రభుత్వం ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు రాజన్నదొర చెప్పారు. దీనిపై టిడిపి నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. కొటియా గ్రామాలలో సచివాలయం, రైతు భరోసా కేంద్రాల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. కొటియా గ్రామాలపై ఒడిశా, ఎపి రాష్ట్రాలకు సమాన హక్కులు ఉన్నాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌పర్సన్ రెడ్డి పద్మావతి, వైస్ ఎంపిపిలు రెడ్డి సురేష్, సువ్వాడ గుణవతి, ఎఎంసి చైర్‌పర్సన్ దండి అనంతకుమారి, వైసిపి సీనియర్ నాయకులు దండి, సువ్వాడ రామకృష్ణ, గొర్లి రాజారావు, పెద్దింటి మాధవరావు, మువ్వల ఆదియ్య పాల్గొన్నారు.పట్టాల పంపిణీ తీరుపై వైస్ ఎంపిపి అసంతృప్తిమండలంలో మొదటి విడత భూమి పట్టాల పంపిణీ తీరుపై వైస్ ఎంపిపి రెడ్డి సురేష్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తాను సూచించిన గ్రామాల పేర్లు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే కార్యక్రమంలో దళితులకు భూమి పంపిణీ చేయాలని ఎస్‌సి సొసైటీ అధికారులు పట్టాలతో అక్కడ ప్రత్యక్షమయ్యారు. పట్టణంలోని పెద, చిన దళితవాడలకు చెందిన దళితులు పట్టాలు పంపిణీ చేస్తారని ఆటోల్లో దండిగాం చేరుకున్నారు. ఎంపిపికి తెలియకుండా దళితులకు భూమి పంపిణీ ఎలా చేస్తారని వైస్ ఎంపిపి రెడ్డి సురేష్ ప్రశ్నించారు. తనకు కూడా ఈ విషయం చెప్పలేదని డిప్యూటీ సిఎం రాజన్నదొర ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులందరికీ సమాచారం ఇచ్చి దళితులకు పట్టాలు పంపిణీ చేపట్టాలని రాజన్నదొర ఆదేశించడంతో దళితులు నిరాశతో వెనుదిరిగారు.