ప్రజాశక్తి-పార్వతీపురం టౌన్ : పార్వతీపురంలో ప్రభుత్వ వైద్య కళాశాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షులు ఎం.కృష్ణమూర్తి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన నిరసన దీక్షలు శనివారం రెండోరోజుకు చేరాయి. ఈ దీక్షలకు ఎం.కృష్ణమూర్తి, డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ ఎం.వెంకటరమణ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కృష్ణమూర్తి మాట్లాడుతూ పార్వతీపురం భౌగోళికంగా చాలా విశాలమైన ప్రాంతమని, అనేక వనరులకు పుట్టినిల్లుగా ఉన్నప్పటికీ పేదలకు అత్యవసర వైద్య సదుపాయం అందుబాటులో లేకపోవడం చాలా దారుణమన్నారు. ఎన్నో ఏళ్లుగా సుదూర ప్రాంతాల ప్రజలు అనారోగ్యం వల్ల మరణిస్తున్నారంటే దానికి కారణం జిల్లాలో సరైన వైద్య సదుపాయాలు లేకపోవడమేనని తెలిపారు. జిల్లా కేంద్ర ఆస్పత్రిలో రక్త నిల్వ కేంద్రం కేటాయించకపోవడం చాలా అన్యాయమని వాపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో పార్వతీపురంలో మెడికల్ కళాశాల నిర్మించడం వల్ల ప్రభుత్వ వైద్యం మెరుగుపడుతుందని చెప్పారు. పాలకులు చిత్తశుద్ధితో కళాశాలకు సరిపడా స్థలం కేటాయించి, వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల డిమాండ్లు న్యాయబద్ధమైనవని, కచ్చితంగా ప్రభుత్వం పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల పోరాటానికి రైతు సంఘం నుండి సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. అనంతరం డివైఎఫ్‌ఐ జిల్లా కన్వీనర్ ఎం.వెంకటరమణ మాట్లాడుతూ జిల్లా విద్యార్థులకు ఉపాధి పొందేందుకు అవకాశాలు లేకపోవడంతో చదువులు మధ్యలోనే ఆపివేసి, వలస బాట పడుతున్నారని తెలిపారు. వెంటనే జిల్లాలో మూసివేసిన పరిశ్రమలు తెరిపించి, నూతన పరిశ్రమలు నిర్మించి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్, సహాయ కార్యదర్శి కె.రాజు, అఖిల్, రవి, సిసింద్రీ, తదితరులు పాల్గొన్నారు.