వైఎస్సార్‌ కల్యాణమస్తు నాలుగో విడత నిధులు విడుదల

ప్రజాశక్తి – పార్వతీపురం : వైఎస్సార్‌ కల్యాణమస్తు నాలుగో విడత నిధుల విడుదల కార్యక్రమంలో భాగంగా జిల్లాలో 697మంది దంపతులకు మంజూరైన రూ.4.95కోట్లు చెక్కును కలెక్టరు నిశాంత్‌ కుమార్‌ లబ్దిదారులకు అందజేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తన కార్యాలయం నుంచి నిర్వహించిన కార్యక్రమానికి కలెక్టరు కార్యాలయం నుంచి జిల్లాకలెక్టరు నిశాంత్‌ కుమార్‌, అధికారులు, లబ్దిదారులు వర్చువల్‌గా హాజరయ్యారు. ముఖ్యమంత్రి మీటనొక్కి డబ్బులను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోకి జమచేశారు. కార్యక్రమంలో కలెక్టరు మాట్లాడుతూ బాల్యవివాహాలను నిరోధించేందుకు, మహిళలకు కనీస విద్యనందించేందుకు కల్యాణమస్తు కార్యక్రమం దోహదం చేస్తుందని తెలిపారు. పేదల తల్లిదండ్రులు తమ పిల్లలను చదివించేందుకు అమ్మఒడి, నాడు నేడు వంటి కార్యక్రమాలు, వారి వివాహాన్ని గౌరవప్రదంగా జరిపించేందుకు ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీలు, దివ్యాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైఎస్సార్‌ కల్యాణమస్తు ద్వారా, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైఎస్సార్‌ షాదీ తోఫా ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందన్నారు. కనీసం పదో తరగతి చదివి, వధువుకు 18 ఏళ్లు, వరునికి 21 ఏళ్లు నిండి వివాహం చేస్తుకున్న వధూవరులు వివాహమైన 30 రోజుల్లోపు తమ దగ్గర్లోని గ్రామ/వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకొని ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం పొందవచ్చునని తెలిపారు. రాష్ట్రంలోని మహిళలకు సాధికారత కల్పించాలనే లక్ష్యంతో కులాంతర వివాహాలు చేసుకున్న వధువులకు వారి ఖాతాలోనూ, అదే కులంలో వివాహాలు చేసుకున్న వధువులకు వారి తల్లుల బ్యాంకు ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేస్తోందని కలెక్టరు తెలిపారు. జిల్లాలో 697 దంపతుల్లో బిసిలకు చెంది అదే కులంలో వివాహం చేసుకున్నవారు 414, కులాంతర వివాహం చేస్తుకున్నవారు 13, వివాహం చేసుకున్న దివ్యాంగులు 9, షెడ్యూల్డు కులాలకు చెంది అదే కులంలో వివాహం చేసుకున్నవారు 94, కులాంతర వివాహం చేసుకున్నవారు 11, షెడ్యూల్డు జాతులకు చెంది అదేకులంలో వివాహం చేసుకున్న వారు 146, కులాంతం వివాహం చేసుకున్నవారు 10 మంది దంపతులకు నిధులు విడుదల చేశామన్నారు. పేద కుటుంబాల్లో వివాహాలకు ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ కల్యాణమస్తు పథకం ద్వారా అందిస్తున్న నిధులు తమ కుటుంబాలను చాలా ఆదుకుంటుందని, ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయం కొత్త జీవితాన్ని ఆరంభించిన తమకు ఎంతో ఉపయోగకరమని సంతోషం వ్యక్తం చేశారు. కులాంతర వివాహం చేసుకున్న యువతకు ఇస్తున్న కల్యాణమస్తు నిధులు పెంచి అందించడం తమకు ఎంతో సంతోషంగా ఉందనిపట్టణానికి చెందిన బూరగాన గౌరీశంకర్‌, మెల్లిక హేమలత దంపతులు, బంద బంగారయ్య, దన్నాన సుశీల దంపతులు ఆనందం వ్యక్తం చేశారు.

➡️