ప్రజాశక్తి – మక్కువ : సాలూరు నియోజకవర్గ పరిధిలో వర్షాల్లేక పంటలు ఎండిపోయి దిక్కు తోచని స్థితిలోఉన్న రైతులున్నారని, వారు పడుతున్న ఇబ్బందులు రాష్ట్ర ప్రభుత్వానికి పట్టవా అని సాలూరు నియోజకవర్గ జనసేన, టిడిపి సమన్వయకర్త గేదెల రిషివర్ధన్ ప్రశ్నించారు. మండలంలోని కోన, దబ్బగెడ్డ, విజయరాంపురం తదితర గ్రామాల్లో వరి పంటలు వేసి నష్టపోయిన రైతులను ఆదివారం ఆయన పరమర్శించారు. అనంతరం పంటపొలాలకు వెళ్లి ఎండిపోయిన పంటలను పరిశీలించారు. ఇప్పటి వరకు కొన్ని చోట్ల పంట నష్టం జరిగిందని, వారికి తగిన నష్ట పరిహారాన్ని, వాటికి సంబంధించి రైతులకు తగిన, హామీ కాని ఇవ్వకపోవడం దారుణమన్నారు. అధికారులు, అధికార పార్టీ నేతలు రైతులకు స్పష్టమైన హామీ ఇచ్చి వారికి పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మండల కేంద్రంలో, అనంతరం పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులతో కలసి ధర్నా చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో జనసేన సీనియర్ నాయకులు చప్పా రమేష్, దబ్బగెడ్డ టిడిపి సీనియర్ నాయకులు లావేటి కృష్ణ, డి.రామకృష్ణ, కోన గ్రామ సీనియర్ కార్యకర్త జి.వెంకటేష్, ఇరు పార్టీల కార్యకర్తలు, పంటలు నష్టపోయిన రైతులు పాల్గొన్నారు.