ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి : మౌనం అర్థ అంగీకారం అంటారు పెద్దలు. మేథావులు, ప్రజాప్రతినిధుల మౌనం సమాజానికి చేటని కూడా మరికొంతమంది చెబుతుంటారు. తాజాగా అటువంటి సూక్తులు, నీతి వాక్యాలే గుర్తు చేస్తున్నారు జిల్లా ప్రజానీకం. అపరిచిత వ్యక్తి ప్రభుత్వ పథకాలపై సమీక్షలు చేస్తుంటే జిల్లా ఉన్నతాధికారిగానీ, ప్రజాప్రతినిధులు గానీ నోరు మొదపకపోవడం వెనుక మర్మమేమిటో? అన్నది పబ్లిక్ టాక్. ఈనెల 21, 22 తేదీల్లో విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో ఓ అపరిచత వ్యక్తి క్షేత్ర స్థాయి పరిశీలనకు రావడంతోపాటు ప్రభుత్వ పథకాలపై సమీక్ష చేసిన సంగతి తెలిసిందే. ఉపాధి హామీ పనులు చేపట్టిన మట్టి పనులు మొదలుకుని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, డ్వాక్రా రుణాలు, ఏజెన్సీలో చెక్‌డ్యాంల నిర్మాణ అవసరాల వరకు ఆరా తీయడం, రెండో రోజు పార్వతీపురం జిల్లా పర్యటన ముందుగా అనుకున్న షెడ్యూల్ మార్పుచేయడం, మీడియా కంటపడకుండా జాగ్రత్తలు వహించడం, ఇందుకు అధికారులు కూడా సహకరించడం చర్చనీయాంశంగా మారింది. మమూలుగా ఆలోచిస్తే ఎవరో జిల్లాలకు వచ్చి వెళ్లారని భావించవచ్చని, ఆ అపరిచిత వ్యక్తి అధికారిక సమీక్షలు, ఆపై అత్యంత గోప్యత ప్రదర్శించడం వెనుక ఏదో ఎవరి ప్రమేయమో ఉండే ఉంటుందని జనం చర్చించుకుంటున్నారు. ఈ వ్యవహారం నడిచి నాలుగు రోజులు కావచ్చినా జిల్లా సర్వోన్నత అధికారిగానీ, జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులుగానీ స్పందించకపోవం పట్ల జనం విస్తుపోతున్నారు. చివరకు డ్వామా పీడీ కూడా నోరు మెదపడం లేదు. అపరిచిత, అనధికార పర్యవేక్షణపై తీగలాగితే…. డొంక కదిలిన చందంగా బయటపడుతుంది. కానీ, ఆ తీగ లాగేందుకు ఎందుకు సాహించడం లేదో అర్థం కాని పరిస్థితి నెలకుందంటూ కొందరు తలలు పట్టుకుంటున్నారు. జిల్లా కలెక్టర్‌కు తెలియకుండా రాష్ట్ర స్థాయి అధికారులెవరైనా ఇటువంటి నాటకానికి తెరలేపారా? అన్న సందేహాలు, ఊహాగానాలు కూడా వ్యక్తమౌతున్నాయి. ఈనేపథ్యంలో ఆ అపరిచత వ్యక్తి పరిశీలించిన అమృత్ సరోవర, మొక్కలు పెంపకం, ఏజెన్సీలో చెక్‌డ్యామ్‌ల మంజూరు, నిర్మాణాల పట్ల జనమే ఓ కన్నేసి ఉంచాల్సిన అవసరముందని జనం చర్చించుకుంటున్నారు. చెప్పినట్టుగా చేయలేకపోతేనే సంబంధిత అధికారులు, ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీచేస్తున్న ఉన్నతాధికారులు దీనిపై ఎందుకు స్పందించడం లేదన్నది సాక్షాత్తు కొంతమంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగుల నోట వినిపిస్తున్న మాట. దీన్ని ఇలాగే వదిలేస్తే అజ్ఞాత నాటకంలో అపరిచితుల పెత్తనం పెచ్చుమీరుపోయే ప్రమాదం లేకపోలేదని కూడా చర్చనడుస్తోంది. ఈ వ్యవహారం ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి దృష్టిలో ఉండకపోవచ్చు. తెలిస్తే సంబంధిత వ్యక్తులకు తాట తీసినంత పనే చేస్తారని వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులుగానీ, ప్రజాప్రతినిధులుగానీ ఇప్పుడు స్పందించకపోతే, ఎప్పటికైనా నాటకీయ పరిణామాలు బయటపడతాయని పలువురు ధీమా వ్యక్తం చేస్తున్నారు.