ముగిసిన ఎస్‌ఎఫ్‌ఐ దీక్షలు

Nov 29,2023 21:36

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌   : జిల్లాలో విద్యారంగ సమస్యలపై ఎస్‌ఎఫ్‌ఐ చేపట్టిన నిరసన దీక్షలు బుధవారం ముగిశాయి. ఈ నెల 24న కలెక్టరేట్‌ వద్ద ప్రారంభించిన దీక్షలు ఆరు రోజులపాటు సాగాయి. ఈ దీక్షలకు రెడ్‌క్రాస్‌ చైర్మన్‌ డాక్టర్‌ మంచిపల్లి శ్రీరాములు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి చెందుతున్న దేశంలో విద్యార్థులు సమస్యలతో బాధపడుతుండడం చాలా అన్యాయమన్నారు. వెంటనే అటువంటి స్థానిక సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యాలయాలు, వైద్యశాలలు, పరిశ్రమలు సంపూర్ణంగా ఉంటేనే ఏ ప్రాంతమైనా, దేశమైనా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లా విద్యారంగ అభివృద్ధికి విద్యార్థులు చేస్తున్న పోరాటానికి రెడ్‌క్రాస్‌ నుంచి సహకారం ఉంటుందన్నారు. అనంతరం ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు డి.పండు, పి.రాజశేఖర్‌ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని గురువారం చలో కలెక్టరేట్‌ కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు కె.రాజు, ఉమాశంకర్‌, వరుణ్‌, అఖిల్‌, తదితరులు పాల్గొన్నారు.

➡️