ప్రజాశక్తి-సీతానగరం : సీతానగరం మండలంలోని జోగంపేట గురుకులంలో మూడు రోజుల పాటు నిర్వహించిన అండర్-14, 17, 19 బాలబాలికల రాష్ట్ర స్థాయి 67వ ఆర్చరీ పోటీలు సోమవారం ముగిశాయి. ముగింపు కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆర్.గోవిందరావు మాట్లాడారు. క్రీడలు వల్ల యువతలో మానసిక ఉల్లాసం, క్రమశిక్షణ, ఆరోగ్యకరమైన వాతావరణం ఉంటుందని తెలిపారు. క్రీడలలో విజేతలకు, పాల్గొన్నవారికి ఇచ్చే ప్రశంసాపత్రాలు ఎంతో ఉపయోగకరమని చెప్పారు. గెలుపుకంటే పాల్గొనడం ముఖ్యమని ప్రతీ క్రీడాకారుడు గుర్తించాలని తెలిపారు. ఆర్చరీ క్రీడలు విజయవంతంగా నిర్వహించిన క్రీడా సిబ్బందికి, మండల, జిల్లా విద్యాశాఖ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. డిసెంబర్ 15 నుండి 50 రోజుల పాటు ఆడుదాం ఆంధ్రా క్రీడలు కూడా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. డిఇఒ ఎన్.ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ క్రీడల వల్ల విద్యార్థుల్లో పోటీతత్వం పెరుగుతుందని తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఎంపికైన వారు త్వరలో గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్‌లో జరిగే జాతీయ స్థాయి పోటీలో పాల్గొంటారని తెలిపారు. పోటీలకు 13 జిల్లాల నుండి 600మంది క్రీడాకారులు హాజరయ్యారు. అనంతరం విజేతలకు బహుమతులు, ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఎంఇఒలు సూరిదేముడు, వెంకటరమణ, కర్రి ప్రసాదరావు, ప్రిన్సిపల్ ఈశ్వరరావు, ప్రతిభ కళాశాల ప్రిన్సిపల్ పోల వెంకటనాయుడు, తదితరులు పాల్గొన్నారు.