ప్రజాశక్తి-మారేడిమిల్లిమధ్యాహ్నం భోజన పథకం కార్మికులు, స్కూల్ శానిటేషన్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ సిఐటియు ఆధ్వర్యాన బుధవారం మారేడుమిల్లి మండలం విద్యాశాఖ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఎంఇఒకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ మండల కమిటీ సభ్యులు ఈ.సిరిమల్లిరెడ్డి, మధ్యాహ్నం భోజనం, స్కూల్ శానిటేషన్ కార్మికుల సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు కె.శాంతిరాజు మాట్లాడుతూ సమస్యల పరిష్కారంలో వైసిపి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. మధ్యాహ్నం భోజనం కార్మికులకు, శానిటేషన్ వర్కర్లకు శ్రమకు తగిన వేతనం ఇస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని అమలు చేయలేదన్నారు. డిమాండ్లపై శాంతియుతంగా ఆందోళనలు చేస్తుంటే పోలీసులతో నిర్బంధాలు ప్రయోగించి నియంత పాలన సాగిస్తున్నారని విమర్శించారు. మధ్యాహ్నం భోజనం, స్కూల్ శానిటేషన్ కార్మికుల బకాయి వేతనాలు చెల్లించాలని, పెట్టుబడి బిల్లులు ఇవ్వాలని, ధరలకు అనుగుణంగా విద్యార్థికి మెస్ చార్జీలు రూ.20కు పెంచాలని, ప్రతి నెల 5వ తేదీలోపు వేతనాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని, ప్రమాద బీమా సౌకర్యాలు కలిపించాలని, యూనిఫారం, వంటపాత్రలు ఇవ్వాలని, నెల వేతనం రూ.10వేలుకు పెంచాలని డిమాండ్ చేశారు. పై సమస్యలను పరిష్కరించకుంటే పోరాటాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేలీన, జి.చంద్రమణి, జె.కనకరాజేశ్వరి, వి.సుజాత తదితరులు పాల్గొన్నారు.