ప్రజాశక్తి – సాలూరు: దేవుడి భూములు కైంకర్యం చేస్తున్న భాగోతంలో దేవాదాయ శాఖ అధికారులే అసలు సూత్రధారులుగా కనిపిస్తున్నారు. ఆలయం ఆస్తులు అన్యాక్రాంతమవుతున్నా ఆక్రమణదారులతో దేవాదాయ శాఖ అధికారులు కుమ్మక్కవ్వడం వల్లనే చర్యలు కనిపించడం లేదు. దొంగలు దొంగలు కలిసి భూములు పంచుకున్నట్లు ఆక్రమణదారులు, దేవాదాయ శాఖ అధికారులు పరస్పర అవగాహనతో నడుచుకుంటూ దేవునికే శఠగోపం పెడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. పట్టణంలోని వడ్డివీధి రామమందిరం పేరిట కోట్లు విలువ చేసే భూములు ఉన్నాయి. సీతారామస్వామి పేరిట నెలిపర్తి రెవిన్యూ పరిధిలో 30ఎకరాల భూములు ఉన్నాయి. సర్వే నెంబర్ 52/1 నుంచి 58/3 వరకు ఈ భూములు విస్తరించి ఉన్నాయి. ఆలయ ధర్మకర్త మజ్జి సూర్యనారాయణ అనంతరం ఆయన కుటుంబ సభ్యులు ఈ భూములు అనుభవిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఉన్నప్పుడు ఆండ్ర జమిందార్ వడ్డివీధి రామమందిరం పేరిట ఈ భూములు విరాళంగా అందజేశారు. ఆలయం ట్రస్టు పేరిట 170ఎకరాల భూములు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఆలయంలో దేవుడికి రోజువారీ ధూపదీప నైవేద్యాల కోసం ఈ భూములపై వచ్చే ఆదాయాన్ని ఖర్చు చేయాలని నిర్ణయించారు. కోట్లు విలువ చేసే భూములు ఉన్నా ఆలయం అభివృద్ధికి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. గత 20ఏళ్లుగా ఆలయం ధర్మకర్త సాగులోనే భూములు ఉన్నాయి.మజ్జి కుటుంబ సభ్యుల పేరిట పాసుపుస్తకాలుఆలయం భూములు ట్రస్ట్ పేరిట ఉన్నందున వాటికి సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలు ట్రస్ట్ పేరునే మంజూరు చేయాల్సి ఉంది. అయితే గతంలో పనిచేసిన మండల రెవెన్యూ అధికారులు ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులతో లాలూచీ పడి వారి పేరిట పట్టాదారు పాసుపుస్తకాలు జారీ చేశారు. దీంతో వారు ఆ భూములను తమ సొంత ఆస్తులు గా పరిగణిస్తున్నారు. వాటిపై వస్తున్న లీజు ఆదాయాన్ని దేవాదాయ అధికారులతో కుమ్మక్కై అనుభవిస్తున్నారు. గతంలో బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం వడ్డివీధి రామమందిరం పేరిట ఉన్న కొంత భూమి అమ్మకమైంది. దీని కింద పరిహారంగా రూ.17లక్షలు మంజూరయ్యాయి. ఈ పరిహారాన్ని సాగుదారులుగా ఉన్న ఆలయం ధర్మకర్త కుటుంబ సభ్యుల పేరిట మంజూరు చేశారు. అలాగే వ్యక్తుల పేరిట దేవుని భూమి పరిహారాన్ని పంపిణీ చేయొద్దని కొంతమంది జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేశారు. అయితే అప్పటి సబ్ కలెక్టర్ ఆలయ ధర్మకర్త కుటుంబ సభ్యులతో లాలూచీ పడి పరిహారాన్ని వారికే మంజూరు చేశారనే ఆరోపణలు వినిపించాయి. దేవాదాయ అధికారులు ధర్మకర్త కుటుంబ సభ్యులకు పరిహారం చేయొద్దని లేఖ రాసినా రెవెన్యూ అధికారులు పెడచెవిన పెట్టారు. ఈ భూములను జిపిఆర్‌ఎస్ సర్వే చేయాలని, అంతవరకు బైపాస్ రోడ్డు పరిహారం చెల్లించొద్దని కోరినా రెవెన్యూ అధికారులు పట్టించుకున్న దాఖలాల్లేవు. జిపిఆర్‌ఎస్ సర్వే చేయడానికి డిప్యూటీ ఇన్‌స్పెక్టర్ సర్వే స్థానిక మండల తహశీల్దార్ కార్యాలయానికి వచ్చారు. ఆలయం ఇఒ కూడా హాజరయ్యారు. సర్వే చేయడానికి భూమి సాగుదారులుగా ఉన్న ధర్మకర్త కుటుంబ సభ్యులు హాజరు కాలేదు. కానీ హాజరైన రికార్డుల్లో చూపించారు. టిడిపి హయాంలో ఈ సంఘటన జరగడం, అధికారపార్టీ నాయకులతో ధర్మకర్త కుటుంబ సభ్యులకు సంబంధాలు కలిగి ఉండడంతో సర్వే చేయకుండానే మమ అనిపించారు.’జగనన్నకు చెపుదాం’లో ఫిర్యాదుపై దర్యాప్తువడ్డివీధి రామమందిరం పేరిట ఉన్న భూములు అన్యాక్రాంతమవుతున్నాయని మాజీ కౌన్సిలర్ పిరిడి రామకృష్ణ ఈనెల 24న జగనన్నకు చెపుదాం కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ గోవిందరావుకు ఫిర్యాదు చేశారు. కోట్లాది రూపాయల విలువైన భూములను దేవాదాయ శాఖ అధికారుల అండదండలతో ఆలయం ధర్మకర్త కుటుంబ సభ్యులు అనుభవిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. నెలిపర్తి రెవెన్యూ పరిధిలో బైపాస్ రోడ్డుకు ఆనుకుని ఉన్న ఈ భూముల విలువ ప్రస్తుత మార్కెట్ ధర ప్రకారం రూ.50కోట్లపైనే ఉంటుంది. ఇంతటి విలువైన భూములను కాపాడుకోవడంలో దేవాదాయ శాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేయడంతో మండలతహశీల్దార్ బాలమురళీకష్ణ విచారణ ప్రారంభించారు.