ప్రజాశక్తి-విజయనగరం, భోగాపురం : ఓటర్ల జాబితాలను ప్రతీ పోలింగ్ స్టేషన్లోనూ ఉంచాలని, జిల్లా పరిశీలకులు, రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు ఆదేశించారు. సోమవారం జిల్లాలో పర్యటించారు. భోగాపురం మండలం రాజాపులోవలోని 196, 197 పోలింగ్ కేంద్రాలను, విజయనగరం విటి అగ్రహారంలోని 58-63 పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. బిఎల్‌ఒలతో మాట్లాడి ఫారం 6,7,8పై ఆరా తీశారు. ఓట్ల చేర్పింపు, తొలగింపు ప్రక్రియపై ఇళ్లకు వెళ్లి విచారణ చేస్తున్నారా? లేదా? అని ప్రశ్నించారు. ఫారమ్ 6,7,8 దరఖాస్తులను పరిశీలించారు. కొత్త ఓటర్లపై ఆరా తీశారు. 18 ఏళ్లు నిండినవారిందరికీ ఓటు హక్కు కల్పించాలని ఆదేశించారు. ఓట్ల తొలగింపు ప్రక్రియపై ప్రశ్నించారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం వాటిని వెంటవెంటనే ఆన్‌లైన్లో నమోదు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట ఆర్‌డిఒ ఎంవి సూర్యకళ, ఇఆర్‌ఒ నూకరాజు, తాహశీల్దార్లు బంగార్రాజు, కోరాడ శ్రీనివాసరావు, డిప్యూటీ తాహశీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంపై దృష్టి పెట్టాలిజిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై జిల్లా పరిశీలకులు జె.శ్యామలరావు సంతృప్తి వ్యక్తం చేశారు. ముఖ్యంగా జిల్లాలో యువ ఓటర్లపై దృష్టిపెట్టి, అధిక సంఖ్యలో చేర్పించడం పట్ల ఆయన జిల్లా యంత్రాంగాన్ని అభినందించారు. కలెక్టరేట్‌లో ఎన్నికల అధికారులు, సహాయ ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో భేటీ అయి, వారి అభిప్రాయాన్ని తెలుసుకున్నారు. ఓటర్ల ఓటర్ల నమోదుపై కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన డిస్‌ప్లే బోర్డుపై సంతకాలు చేశారు. జిల్లాలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పురోగతిని కలెక్టర్ నాగలక్ష్మి ముందుగా వివరించారు. అనంతరం జాబితా పరిశీలకులు శ్యామలరావు మాట్లాడుతూ, జిల్లాలో 18, 19 ఏళ్ల వయసు గల యువ ఓటర్లను అధిక సంఖ్యలో చేర్పించడం అభినందనీయమని అన్నారు. అర్హత ఉన్న ప్రతీఒక్కరికీ ఓటుహక్కు కల్పించాలని ఆదేశించారు. జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన తదతర పథకాల లబ్దిదారుల జాబితాలను పరిశీలించి, 18 ఏళ్లు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించాలని సూచించారు. శని, ఆదివారాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటర్ల జాబితా నమోదు కార్యక్రమంపై దృష్టి పెట్టి, దీనికి విస్తత ప్రచారం నిర్వహించా లని చెప్పారు. అన్ని రకాల ఫారాలను పోలింగ్ కేంద్రాల వద్ద అందుబాటులో ఉంచాలన్నారు. జిల్లాలో ఖచ్ఛితమైన ఓటర్ల జాబితాను అత్యంత పారదర్శకంగా జాబితాలను తయారు చేస్తామని హామీ ఇచ్చారు. సమావేశాల్లో జాయింట్ కలెక్టర్ మయూర్ అశోక్, డిఆర్‌ఒ ఎస్‌డి అనిత, వివిధ నియోజకవర్గాల ఇఆర్‌ఒలు, ఆర్‌డిఒలు, తాహశీల్దార్లు, డిటిలు పాల్గొన్నారు.