ప్రజాశక్తి – పార్వతీపురంటౌన్ : ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు అని, ప్రతి ఓటరు ఓటు హక్కును వినియోగించుకోవాలని జాయింటు కలెక్టరు ఆర్.గోవిందరావు తెలిపారు. స్వీప్ కార్యక్రమంలో భాగంగా గురువారం స్థానిక ఆర్‌సిఎం ప్రాంగణంలో జిల్లా కార్యాలయాల సముదాయం నుంచి కలెక్టరేట్ వరకూ ఓటరు నమోదు అవగాహన ర్యాలీని జాయింటు కలెక్టరు ప్రారంభించారు. ర్యాలీ అనంతరం కలెక్టరు కార్యాలయం వద్ద మానవహారంగా ఏర్పడి ఓటరు అవగాహనకు సంబంధించి నినాదాలు చేశారు. కార్యక్రమంలో జాయింటు కలెక్టరు మాట్లాడుతూ దేశ భవిష్యత్తును నడిపించేది యువతేనని, ప్రపంచంలోనే అత్యధిక యువత కలిగిన దేశం భారతదేశమని, ప్రతియువత ఓటరుగా నమోదు చేసుకొని ప్రజాస్వామ్య వ్యవస్థలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. డిశంబరు 2,3 తేదీల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమంలో 2024 జనవరి 1 నాటికి 18ఏళ్లు పూర్తికానున్న ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, అందుకు కావాల్సిన ఫారాలు బూత్ లెవల్ అధికారుల వద్ద ఉంటాయని లేదా ఎన్నికల కమిషను వెబ్సైట్ నందు నేరుగా నమోదు చేసుకోవచ్చునని తెలిపారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. ర్యాలీకి హాజరైన విద్యార్థులు తమ కుటుంబాల్లో 18 ఏళ్లు నిండిన వారుంటే వారిని ఓటరుగా చేర్చించాలని, ఓటు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కొనేలా అవగాహన కల్పించాలని తెలిపారు. ఆర్‌డిఒ కె.హేమలత మాట్లాడుతూ 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని, ఓటు హక్కును వినియోగించుకో వాలని తెలిపారు. ఓటర్లకు ఇవిఎంలపై అవగాహన, ఓటు వేసే విధానాన్ని తెలుసుకొనేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. శాశ్వత, మొబైల్ ఎలక్ట్రానిక్ ఓటింగు మిషను ప్రదర్శన సెంటర్లను సందర్శించి నమూనా ఓటు వేసి, ఓటు వేసే విధానాన్ని తెలుసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో కెఆర్‌సిసి డిప్యూటీ కలెక్టరు కేశవనాయుడు, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి వెంకటేశ్వరరావు, తహశీల్దారు శివన్నారాయణ, ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఓటు హక్కును నమోదు చేసుకోవాలి : పిఒపాలకొండ : అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కును నమోదు చేసుకోవాలని సీతంపేట ఐటిడిఎ పిఒ కల్పన కుమారి అన్నారు. గురువారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఓటు హక్కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పిఒ మాట్లాడుతూ ఓటు హక్కు చాలా విలువైం దని, దాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించు కోవాలని అన్నారు. ఓటు హక్కు వినియోగం ద్వారా బంగారు భవిష్యత్‌ను నిర్మించుకోవాల న్నారు. అర్హత ఉండి ఓటు హక్కు పొందని వారు సచివాలయాలకు వెళ్లి ఓటు హక్కును నమోదు చేసుకోవాలన్నారు. అవసరమైతే విద్యార్థులే బాధ్యత తీసుకుని గ్రామాల్లో ఇంటింటా ప్రచారం చేసి శతశాతం ఓటు హక్కు నమోదు చేయించాలని సూచించారు. ఇలాంటి సదస్సులు ఏర్పాటు చేసి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో తహశీల్దారు సోమేశ్వరరావు, ప్రిన్సిపల్ ఎం.శ్యాంబాబు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.