ప్రజాశక్తి-సీతానగరం : జల జీవన్ మిషన్ పనులను త్వరగా పూర్తిచేసి ప్రతిఇంటికీ పరిశుభ్రమైన మంచినీరు అందించాలని కలెక్టరు నిశాంత్‌కుమార్ అధికారులను ఆదేశించారు. బుధవారం సీతానగరం మండలంలో మరిపివలస, అప్పయ్యపేట గ్రామాల్లో జరుగుతున్న జల జీవన్ మిషన్ పనులను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు. ప్రజల ఆరోగ్యానికి సురక్షితమైన మంచినీరు ఎంతో అవసరమని, జలజీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేసే అవకాశం ఏర్పడిందని తెలిపారు. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాలో ప్రతి ఇంటికీ మంచినీటి కుళాయి ఏర్పాటు చేయాలని నీటి సరఫరా అధికారులను ఆదేశించారు. లక్ష్యం మేరకు పనులను సకాలంలో పూర్తిచేయాలని, నిధులకు కొరతలేదని చెప్పారు. పనులు నాణ్యంగా పూర్తి చేసి వెంటనే బిల్లులను చెల్లింపుల నిమిత్తం సమర్పించాలని కలెక్టరు తెలిపారు. పెండింగు పనులను వారంరోజులలో పూర్తిచేయాలని ఆదేశించారు. జిల్లా ఆర్‌డబ్ల్యుఎస్ ఇంజినీరింగ్ అధికారి ఒ.ప్రభాకరరావు పనుల పురోగతి గూర్చి వివరించారు. మరిపివలసలో 300, అప్పయ్యపేటలో 430 కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో ఇంకా 1500 కుళాయి కనెక్షన్లు ఇవ్వాల్సి ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్‌డబ్ల్యుఎస్ మండల ఇంజనీరింగ్ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.