ప్రజాశక్తి – సాలూరు : మున్సిపాలిటీలో పారిశుధ్య నిర్వహణపై అధికారులు దృష్టి సారించాలని సభ్యులు కోరారు. గురువారం మున్సిపల్ చైర్‌పర్సన్ పువ్వుల ఈశ్వరమ్మ అధ్యక్షతన జరిగిన సాధారణ సమావేశంలో కౌన్సిలర్లు మాట్లాడారు. కౌన్సిలర్ రాపాక మాధవరావు మాట్లాడుతూ వార్డు పరిధిలో ఉన్న మజ్జులపేటలో సామాజిక మరుగుదొడ్డికి వెళ్లేదారిలో బల్బు వేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని చెప్పారు. విద్యుత్ దీపం లేకపోవడంతో పాముకాటు కు గురయ్యే అవకాశాలు వున్నాయని చెప్పారు. మూడునెలలుగా కోరుతున్నా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. పట్టణంలో పారిశుధ్యంపై దృష్టి సారించాలని వైస్ చైర్మన్ వంగపండు అప్పలనాయుడు కోరారు. కౌన్సిలర్లు బి.శ్రీనివాసరావు,గొర్లి వెంకటరమణ, రాపాక మాధవరావు కూడా పారిశుద్ధ్య నిర్వహణపై దృష్టి సారించాలని సూచించారు. మరమ్మతులకు గురైన సామాజిక మరుగుదొడ్లను బాగు చేయాలని వైస్ చైర్మన్ వంగపండు కోరారు. రూ.50వేలలోపు ఖర్చు అయ్యే పనులు చేపట్టాలని కమిషనర్ జయరాం ఎఇ సూరి నాయుడును ఆదేశించారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుకు స్థలం సూచించాలని కౌన్సిలర్లు సింగారపు ఈశ్వరరావు, గొల్లపల్లి వరప్రసాద్ కోరారు. అలాగే స్థానిక తహశీల్దార్ కార్యాలయం ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పక్కన అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చునని కమిషనర్ జయరాం చెప్పారు. సమావేశంలో వైస్ చైర్మన్ జర్జాపు దీప్తి, ఫ్లోర్ లీడర్ గొర్లి జగన్మోహన్‌రావు, కౌన్సిలర్లు, వివిధశాఖ అధికారులు పాల్గొన్నారు.