పథకాల కోసమే అప్పులు : డిప్యూటీ సిఎం

  ప్రజాశక్తి-పాలకొండ :  అప్పు చేసిన డబ్బులు ప్రజల సంక్షేమానికి ఖర్చు చేస్తున్నామని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖా మంత్రి పీడిక రాజన్న దొర అన్నారు. శుక్రవారం సామాజిక సాధికార యాత్రకు ఆయన ముఖ్యఅతిధిగా హాజయ్యారు. ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాలకు తమ ప్రభుత్వం అండగా ఉందన్నారు. ప్రజలకు సంక్షేమ పథకాలతో పాటు, సామాన్యులైన తమను కూడా సమన్యాయంతో పదువులిచ్చి ఉన్నత స్థాయిలోకి తీసుకువచ్చారన్నారు. బాబు తెచ్చిన బ్రాండ్లు, బెల్టు షాపులు తప్ప.. తాము అధికారంలోకి వచ్చి ప్రజలకు వ్యతిరేకమైన పనులు చేయడం లేదన్నారు. ప్రజలకు పాదర్శకత పాలన అందిస్తున్నామని, ఒక్క రూపాయి కూడా అవినీతి లేకుండా ప్రజలు ఖాతాల్లోకి నేరుగా డబ్బులు చేరుతున్నాయన్నారు. చంద్రబాబు పాలనలో అరాచాకాలు, తప్పుడు హామీలతో మోసం చేశారని, మరలా ప్రజలను నమ్మించి హామీలతో మోసగించాలని చూస్తున్నారన్నారని, పొత్తుల బాబును నమ్మవద్దు అన్నారు. వెనుకబడిన తరగతులకు అండగా వైసిపి ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పడానికే బస్సు యాత్ర ఉద్దేశమన్నారు. స్పీకర్‌ తమ్మినేని సీతారాం మాట్లాడుతూ బీసీలు, మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలు సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. మత్స్యశాఖ మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ విశాఖ రాజధాని ఏర్పాటైతే ఉత్తరాంధ్ర ప్రాంతానికి మేలు జరుగుతుందని, అటువంటిది టిడిపి అడ్డుకుంటుందన్నారు. ఎన్ని కుయిత్తులు వేసినా విశాఖ ఆర్థిక రాజధానిగా ఉంటుందన్నారు. సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మొరుగుల నాగర్జున మాట్లాడుతూ రెండోసారి కూడా వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. శాసన మండలి విప్‌ పాలవలస విక్రాంత్‌ మాట్లాడుతూ ప్రజలకు తమ ప్రభుత్వం పారదర్శకంగా పథకాలను అందిస్తుందన్నారు. స్థానిక ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పుడు నియోజకవర్గంలో అభివృద్ధికి కార్యక్రమాలు జరుగుతున్నాయని, దీనిన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా వైసీపీ అధ్యక్షులు పరీక్షిత్‌ రాజు, కురుపాం, రాజాం, పాతపట్నం, పార్వతీపురం ఎమ్మెల్యేలు పుష్పశ్రీవాణి, కంబాల జోగులు, రెడ్డి శాంతి, అలజంగి జోగారావు, నియోజకవర్గ పరిశీలకులు గొండి కృష్ణమూర్తి, జిసిసి చైర్మన్‌ శోభాస్వాతి రాణి, శిష్టకర్ణ సంఘం కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ అనుషా, నియోజకవర్గంలోని నాలుగు మండలాల ఎంపిపిలు, జెడ్పీటీసీలు, పాలవలస దవళేశ్వరరావు, వెలమల మన్మధరావు, దుప్పాడ పాపినాయుడు, లిల్లీ పుష్పనాధం, కడగల రమణ, తుమ్మగుంట శంకరరావు తదితరులు పాల్గొన్నారు. అంతకుముందు చిన్నమంగళాపురంలో రైతు భరోసా కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ర్యాలీగా పట్టణంలోని ఆర్‌సిఎం స్కూల్‌ దగ్గర జరిగిన సభకు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ఉత్తరాంధ్ర వైసీపీ కో ఆర్డినేటర్‌ వైవి సుబ్బారెడ్డి పర్యవేక్షించారు.ప్రజలు అవస్థలు వైసిపి సాధికరిత యాత్రతో ప్రజలు తీవ్ర అవస్థలు పాలయ్యారు. గురువారం సాయంత్రం నుంచే స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ నుంచి కోటదుర్గమ్మ ఆలయం వరకు రహదారి మీద రాకపోకలు నిలిపేశారు. దీంతో బస్సులను కూడా తిరగనివ్వలేదు. దీంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు తీవ్ర అవస్థలకు లోనయ్యారు. చెక్‌ పోస్టు జంక్షన్‌ దగ్గర వాహనాలను నిలిపేయడంతో అక్కడ నుంచే ప్రయాణికులు అవస్థలు పడుతూ నడుచుకుంటూ గమ్యానికి చేరాల్సిన పరిస్థితి వచ్చింది. దుర్మార్గం.. : టిడిపివైసిపి నిర్వహించిన సామాజిక సాధికారిత బస్సు యాత్ర వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు ఎదురవ్వడం దుర్మార్గమైన చర్య అని నియోజకవర్గ టిడిపి ఇన్‌చార్జ్‌ నిమ్మక జయకృష్ణ అన్నారు. ఈమేరకు స్థానిక టిడిపి కార్యాలయం వద్ద నల్లబెలూన్లు ఎరగేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా రవాణాను స్థంభించి ఇటువంటి సమావేశాలు నిర్వహించడం అన్యాయమన్నారు. తమ పార్టీ అధికారంలో ఉందని, ఇలాంటి దుర్మార్గమైన పనులు చేయరాదన్నారు. దళితులపై దాడులు చేస్తూ మృతదేహాలను ఇంటికి పంపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో అక్రమాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెడుతున్నారని, ఇలాంటి పనులు మానుకోవాలన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర కార్యదర్శి కర్నేన అప్పలనాయుడు, మండల, పట్టణ పార్టీ అధ్యక్షులు గండి రామినాయుడు, గంటా సంతోష్‌ కుమార్‌, చింత ఉమా తదితరులు పాల్గొన్నారు.

➡️