పండిన చోట పండగే..

 ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి :  ఈ ఏడాది ఓవైపు కరువు పరిస్థితులు కాటేసినప్పటికీ కాస్త నీటి వసతి ఉన్నచోట ధాన్యం దిగుబడి బాగానే వచ్చింది. ఇప్పటి వరకు చేపట్టిన పంటకోత ప్రయోగాల్లో వ్యవసాయశాఖ అధికారుల ఇచ్చిన నివేదికలు ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. జిల్లాలో వరి అత్యంత ప్రధానమైనది. ఈ ఏడాది ఖరీఫ్‌లో అత్యధికంగా 2,31,835 ఎకరాల్లో సాగైంది. ఖరీఫ్‌లో జిల్లా వ్యాప్తంగా వ్యవసాయ, ఉద్యాన పంటలకు కలిపి సాధారణ విస్తీర్ణం 4.21 లక్షల ఎకరాలు కాగా, సెప్టెంబర్‌ 30 నాటికి 3.53 లక్షల ఎకరాలు(84శాతం) మాత్రమే సాగయ్యాయి. ఆ తరువాత మరో 11శాతం పెరిగింది. ఈలెక్కన మొత్తం ఇప్పటి వరకు 3.90లక్షల ఎకరాలు (93శాతం) వరకు సాగైంది. ఇందులో వరి చాలా వరకు నీటి ఎద్దడితో ఇప్పటికే ఎండిపోయింది. మరికొంత ఇప్పటికీ తీవ్ర నీటి ఎద్దడి ఎదుర్కొంటోంది. మరోవైపు పంట పండిన చోట మాత్రం పండగే అన్నట్టుగా దిగుబడి కనిపిస్తోంది. జిల్లాలో సీజన్‌ మొత్తానికి 2024 పంటకోత ప్రయోగాలు చేపట్టాల్సివుండగా ఇప్పటి వరకు 980 వరకు పూర్తిచేశారు. వీటిని బట్టి ఎకరాకు 75కేజీల గల 30 బస్తాలు (2,270 కేజీలు) వరకు దిగుబడి వచ్చినట్టు అంచనా వేశారు. మొత్తం పంటకోత ప్రయోగాలు పూర్తయితే ఇంతకన్నా పెరగడం లేదా తగ్గడం వంటివి కూడా ఉండవచ్చని చెబుతున్నారు. స్వల్ప తేడా మాత్రమే ఉంటే గత ఏడాది కన్నా ఈ ఎక్కువ దిగుబడి వచ్చినట్టుగా భావించవచ్చు. గత ఏడాది మొత్తం పంటకోత ప్రయోగాలు పూర్తైయ్యేనాటికి ఎకరా పంట విస్తీర్ణంలో 75కేజీల గల 28 బస్తాలు (2077కేజీలు) దిగుబడి వచ్చింది. దీన్నిబట్టి గతం కన్నా ఎక్కువ దిగుబడి వచ్చినట్టుగా అర్థమౌతోంది. వాస్తవానికి గత ఏడాది వచ్చిన 28బస్తాల దిగుబడి గడిచిన పదేళ్లలో ఎప్పుడూ రాలేదని అధికారులు అప్పట్లో ప్రకటించారు. సుమారు లక్ష ఎకరాల్లో కరువు తాండవించినట్టుగా రైతు సంఘాలు, రైతులు అంచనా వేస్తున్నారు. చాలా వరకు రంగు మారడం, అక్కడక్కడ చేను కుళ్లిపోవడం వంటి కారణాల వల్ల రైతులు ఆందోళన చెందుతున్నారు. చెడిపోయిన, రంగుమారిన, మొలకొత్తిన, పురుగుతిన్న ధాన్యపు గింజలు వంటివాటితో నాణ్యతా ప్రమాణాలు తగ్గిస్తామని ప్రభుత్వం చెబుతోంది. ఈనేపథ్యంలో కరువు మండలాలుగా గుర్తించడం, లేదా ఆర్థికంగా భరోసా పలకడం వంటి చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం కేవలం ధాన్యం కొనుగోలు విధానాలపై మాత్రమే ముందుకు సాగుతోంది. పంటలు తీవ్రంగా ఎండిపోవడంతో పాటు నెల తేమశాతం, భూగర్భ జలాల తగ్గడం, రిమోట్‌ సెన్సింగ్‌, పశువులకు గడ్డి, దాణా దొరక్క పోవడం వంటి పరిస్థితులు ఎదురైతేనే కరువుగా గుర్తిస్తారట. జిల్లాలో ఖరీఫ్‌ ఈఏడాది జూన్‌ నుండి సెప్టెంబర్‌ వరకు సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన అంశాల్లోనూ కరువు నిబంధనలకు అనుగుణంగా లేవు.

➡️