ప్రజాశక్తి -పార్వతీపురం రూరల్ : పిల్లల్లో న్యుమోనియా వ్యాధిపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి.జగన్మోహనరావు సూచించారు. ఈ మేరకు ఆయన అడ్డాపుశీలలో అంగన్వాడీ కేంద్రాన్ని గురువారం ఆకస్మికంగా సందర్శించి ఐదేళ్ల లోపు పిల్లల ఆరోగ్య పర్యవేక్షణ వివరాలు రికార్డులో పరిశీలించారు. పిల్లల్లో శ్వాస సంబంధమైన వ్యాధుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా ప్రాణాంతకమైన వ్యాధుల్లో న్యుమోనియా ఒకటని వ్యాధి లక్షణాలు గుర్తిస్తే వెంటనే నివారణా చర్యలు చేపట్టాలని, పిల్లల్లో న్యూమోనియా నియంత్రణకు వైద్యారోగ్యశాఖ సాన్స్ కార్యక్రమం ప్రవేశపెట్టిందని, వైద్య సిబ్బంది సర్వే చేయాలని సూచించారు. ఈ సందర్భంగా డాక్టర్ జగన్మోహనరావు అక్కడ పిల్లల తల్లిదండ్రులకు, సిబ్బందికి పిల్లల్లో న్యుమోనియా లక్షణాలను ఏవిధంగా సులభంగా గుర్తించవచ్చునో వివరించి అవగాహన కల్పించారు. ఈ లక్షణాల్లో ముఖ్యంగా జలుబు, దగ్గు అధికంగా ఉండి త్వర-త్వరగా శ్వాస తీసుకోవడం, శ్వాస తీసుకునేటప్పుడు పక్కటెముకులు కదలడం, అధికంగా జ్వరం రావడం, శ్వాస తీసుకునే సమయంలో శబ్దం రావడం, ఏమీ తినకపోవడం, తాగకపోవడం, అధికంగా నిద్రపోవడం మొదలగు లక్షణాల ద్వారా గుర్తించవచ్చని అన్నారు. వాతావరణంలో మార్పులు, వ్యాధినిరోధక శక్తి తక్కువగా ఉండడం, పౌష్టికాహారం సరిగా తీసుకోని పిల్లల్లో న్యుమోనియా అధికమవుతుందని అన్నారు. న్యుమోనియా నుండి సురక్షితంగా ఉండాలంటే బిడ్డ శరీరాన్ని బట్టలతో పూర్తిగా కప్పి ఉంచాలని, ఇంట్లో పొగలేకుండా చూసుకోవడం, కిటికీలు తెరచిఉంచడం, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. పుట్టిన బిడ్డకు గంటలోనే ముర్రుపాలు పట్టించాలని, మొదటి ఆరు నెలలు కేవలం తల్లి పాలు మాత్రమే ఇవ్వాలన్నారు. వైద్య, ఐసిడిఎస్ సిబ్బంది సమన్వయంతో పని చేసి పిల్లల్లో న్యుమోనియా నియంత్రణకు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ జయగౌడ్, ఎఎన్‌ఎం శాంతి కుమారి, అంగన్వాడీ సిబ్బంది శ్రీ లక్ష్మి, అలివేలు, ఆశా కార్యకర్తలు, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.