ప్రజాశక్తి – సాలూరు : దేశంలోని దళిత, గిరిజనులకు భారత రాజ్యాంగం దిక్సూచి లాంటిదని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున నిర్వహిస్తున్న రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయ ఆవరణలో ఉన్న గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసిన తర్వాతనే రాజ్యాంగ పరిషత్ అధ్యక్షుడిగా అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించారని చెప్పారు. ఒక్కో దేశ రాజ్యాంగం లోని గొప్ప గొప్ప అంశాలను తీసుకుని ఇక్కడ రాజ్యాంగంలో పొందుపర్చాని చెప్పారు. దళిత, గిరిజనుల సామాజిక, ఆర్ధిక, రాజకీయ వెనుకబాటుతనాన్ని అప్పటిలో గుర్తించి ముందు చూపుతో రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని చెప్పారు. అలాంటి మహనీయుడు కోట్లాదిమంది భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారని రాజన్నదొర అన్నారు. కార్యక్రమంలో వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి జర్జాపు సూరిబాబు, పట్టణ అధ్యక్షులు వంగపండు అప్పలనాయుడు, జెసిఎస్ కన్వీనర్ గిరిరఘు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ గొర్లి జగన్మోహన్ రావు, కౌన్సిలర్లు గొర్లి వెంకటరమణ, పప్పల లక్ష్మణరావు, వైసిపి నాయకులు హరి బాలాజీ, సింహాచలం,ఎం.అప్పారావు, తాడ్డి యశోదకృష్ణ, వైస్ ఎంపిపి రెడ్డి సురేష్ పాల్గొన్నారు.