తగ్గేదేలే… కేసులే

Nov 30,2023 20:35

ప్రజాశక్తి – సాలూరు:  తప్పుడు విమర్శలు చేసినా, వార్తలు రాసినా వదిలేది లేదని డిప్యూటీ సిఎం రాజన్నదొర హెచ్చరించారు. గురువారం స్థానిక మున్సిపల్‌ కార్యాలయ ఆవరణలో జగనన్న దళిత భూ శాశ్వత హక్కు పథకం కింద పట్టణ, మండలంలోని దళితులకు పట్టాల పంపిణీలో రాజన్నదొర సంచలన వ్యాఖ్యలు చేశారు. టిడిపి నాయకులు, దానికి అనుకూలంగా వార్తలు రాసే విలేకరులనుద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. తనపై విమర్శలు చేసేటప్పుడు వాస్తవాలు తెలుసుకోకుండా చేస్తే సహించబోనని చెప్పారు. టిడిపి నాయకులు చేసిన తప్పుడు విమర్శలు వార్తలు రాసిన విలేకరులనూ ఉపేక్షించేది లేదన్నారు. ‘తాడూ బొంగరం లేనప్పుడే గల్లీ నుంచి ఢిల్లీ దాకా న్యాయ పోరాటం చేశాను, మీ అందరి ఆశీస్సులతో నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, ఇప్పుడు మంత్రి, డిప్యూటీ సిఎం హౌదాలో ఉన్నాను, కాబట్టి అలాంటి వారిని సుప్రీంకోర్టు వరకైనా లాగుతాను’ అని ఆయన ఆవేశంగా మాట్లాడారు. టిడిపి పట్టణ అధ్యక్షుడు నిమ్మాది తిరుపతిరావు మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాజన్నదొరనుద్దేశించి పలు ఆరోపణలు చేశారు. డిప్యూటీ సిఎంగా, గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా రాజన్నదొర నియోజకవర్గానికి ఏమీ చేయలేదని, గిరిజన యూనివర్సిటీ ఆయన వల్లనే పక్క జిల్లాకు వెళ్లిపోయిందని తిరుపతిరావు ఆరోపించారు. ఈ వ్యాఖ్యలనుద్దేశించి రాజన్నదొర ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశారు. తన హయాంలో గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వంలో గానీ, ఇప్పుడు వైసిపి ప్రభుత్వం హయాంలో గానీ ఏం అభివృద్ధి జరిగిందో చర్చకు రావాలని అనేక సార్లు పిలిచినా టిడిపి నాయకులు రాలేదన్నారు. టిడిపి ప్రభుత్వం హయాంలోనే పాచిపెంటలో ఏర్పాటు చేయాల్సిన గిరిజన యూనివర్సిటీ కొత్తవలసకు వెళ్లిందని చెప్పారు. అప్పుడు నియోజకవర్గ టిడిపి నాయకులు ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించారు. ఉమ్మడి జిల్లా టిడిపి నేత, మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతి రాజు గిరిజన యూనివర్సిటీని పాచిపెంట మండలంలో ఏర్పాటు చేయాలని కోరారని, కొత్తవలస తరలింపుపై ఆయన కూడా అసంతృప్తి వ్యక్తం చేశారని గుర్తు చేశారు. 2014నుంచి 2019 వరకు టిడిపి ప్రభుత్వం హయాంలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి పనులు ఏమిటో చెప్పాలని డిమాండ్‌ చేశారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో గాని, ఇప్పుడు వైసిపి ప్రభుత్వం హయాంలో గాని తాను ఏయే అభివద్ధి పనులు చేశానో చెప్పడానికి సిద్ధంగా వున్నానని అన్నారు. దీనిపై త్వరలో ఒక పుస్తకాన్ని పార్టీ నాయకులు విడుదల చేస్తారని తెలిపారు. కాంగ్రెస్‌ హయాంలో పట్టణ టిడిపి అధ్యక్షులు నిమ్మాది తిరుపతిరావు పనుల కోసం తన వద్దకు రాలేదా అని ప్రశ్నించారు. టిడిపి నాయకులు వాస్తవాలు తెలుసుకుని విమర్శలు చేస్తే మంచిదని, లేకపోతే సివిల్‌, క్రిమినల్‌ కేసులు ఎదుర్కోవాల్సి వుంటుందని హితవు పలికారు. టిడిపి నాయకులు చేసే తప్పుడు విమర్శలు వార్తలుగా రాసే విలేకరుల పైనా కేసులు పెడతానని ఆయన హెచ్చరించారు. భూములు అమ్ముకోవద్దుజగనన్న భూ శాశ్వత హక్కు పథకం కింద లబ్ధిపొందిన దళితులు భూములపై హక్కులు వచ్చాయని, అమ్మకానికి పెట్టొద్దని డిప్యూటీ సిఎం రాజన్నదొర కోరారు. భవిష్యత్‌లో భూమికి విలువ పెరుగుతుందని చెప్పారు. ఇప్పటికే కొంతమంది దళితులు భూములను అమ్మేసినట్లు తన దృష్టికి వచ్చిందని చెప్పారు. పిల్లల చదువు కోసమో, ఆరోగ్య అవసరాల కోసమో భూమి తాకట్టు పెట్టుకునే అవకాశం ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. పట్టణంలోని పెద హరిజనపేట, చినహరిజనపేటకు చెందిన దళితులకు పట్టాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ, వైస్‌చైర్మన్‌లు జర్జాపు దీప్తి, వంగపండు అప్పలనాయుడు, వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శులు జర్జాపు సూరిబాబు, దండి శ్రీనివాసరావు, అర్బన్‌ బ్యాంక్‌ అధ్యక్షులు జర్జాపు ఈశ్వరరావు, ఎఎంసి చైర్‌పర్సన్‌ దండి అనంతకుమారి, కౌన్సిలర్లు, తహశీల్దార్‌ బాలమురళీకృష్ణ, మున్సిపల్‌ కమిషనర్‌ జయరాం, సర్పంచ్‌ లు పాల్గొన్నారు.వైస్‌ ఎంపిపి గైర్హాజరుఈ కార్యక్రమానికి ఎంపిపి జి.రాములమ్మ, వైస్‌ ఎంపిపి రెడ్డి సురేష్‌, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్‌ పర్సన్‌ రెడ్డి పద్మావతి గైర్హాజరయ్యారు. డిప్యూటీ సిఎం రాజన్నదొర హాజరైన ఈ కార్యక్రమానికి మండల జెసిఎస్‌ కన్వీనర్‌ కళ్ళే పిల్లి త్రినాథనాయుడు కూడా హాజరు కాలేదు. తహశీల్దార్‌ కార్యాలయానికి సంబంధించిన సమాచారం తనకు అందడం లేదని వైస్‌ ఎంపిపి అలక వహించినట్లు తెలుస్తోంది. రెండు రోజుల క్రితం దండిగాంలో గిరిజనులకు భూపట్టాల పంపిణీ కార్యక్రమంలో కూడా వైస్‌ ఎంపిపి రెవెన్యూ కార్యాలయానికి సంబంధించిన సమాచారం తనకు అందడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

➡️