చిరుధాన్యాల కొనుగోలు ప్రారంభం

Nov 29,2023 21:42

ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్‌ : రైతులు తమ పంటలను రైతుభరోసా కేంద్రాల ద్వారా మద్దతు ధరకు అమ్ముకోవాలని జాయింటు కలెక్టరు ఆర్‌.గోవిందరావు తెలిపారు. బుధవారం మండలంలోని సంగంవలన రైతుభరోసా కేంద్రంలో చిరుధాన్యాలు కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జాయింటు కలెక్టరు మాట్లాడుతూ రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని, రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు కావలసిన సేవలన్నింటిని అందిస్తున్నదని తెలిపారు. రైతు పండించిన పంటకు మద్దతు ధర కల్పించిందన్నారు. రైతుల సమక్షంలో గ్రామంలోని రైతు భరోసా కేంద్రాల ద్వారా ధాన్యం, చిరుధాన్యాలు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఏ రైతు కూడా తన పంటని కనీస మద్దతుధర కన్నా తక్కువకు అమ్ముకోవాల్సిన అవసరం లేకుండా , దళారులు, మిల్లర్ల చేతిలో నష్టపోకూడదనే ఉద్దేశంతో ధాన్యం, చిరుధాన్యాలు ప్రభుత్వమే నేరుగా కొనుగోలు చేస్తోందని తెలిపారు. ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ధాన్యం, చిరుధాన్యాలను మద్దతు ధరకు అమ్ముకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సివిల్‌ సప్లయి జిల్లా మేనేజరు దేవుళ్ల నాయక్‌, జిల్లా సప్లయి అధికారి శివప్రసాద్‌, జిల్లా వ్యవసాయ అదికారి రాబర్ట్‌ పాల్‌, గ్రామ సర్పంచ్‌ బడే చిట్టినాయుడు, రైతులు పాల్గొన్నారు.

➡️