గడువులోగా భవనాలు పూర్తి కావాల్సిందే

సీతానగరం: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ప్రాధాన్యత భవనాలు గడువులోగా పూర్తి కావాల్సిందేనని కలెక్టర్‌ నిశాంత్‌ కుమార్‌ ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మండలంలోని పెద్దభోగిలి, బూర్జ గ్రామాల్లోని నిర్మాణంలో ఉన్న గ్రామ సచివాలయాల పనుల పురోగతిని బుధవారం పరిశీలించారు. నిర్మాణ దశ\లో ఉన్న పనులకు ఎంత మేర బిల్లుల చెల్లింపులు జరిగినవి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణంలో జాప్యం జరగకుండా అవసరమైన సామాగ్రిని ముందస్తుగా ఏర్పాటు చేసుకోవాలన్నారు. నిర్మాణం పూర్తి చేసిన పనులకు సంబంధించిన బిల్లులను వెంటనే అప్లోడ్‌ చేయాలని, నిధులు సమస్య లేనందున బిల్లులు తక్షణ చెల్లింపునకు చర్యలు తీసుకుంటామని అన్నారు. పెద్ద భోగిలి గ్రామ సచివాలయం ఫ్లోరింగ్‌ పనులు త్వరితగతిన పూర్తి చేసి భవనాన్ని అప్పగించనున్నామని ఇంజనీరింగ్‌ అధికారులు కలెక్టర్‌కు తెలిపారు. ఇంజనీరింగ్‌ అధికారులు నిర్మాణ పనులు పూర్తికి ఇచ్చిన సమయం ప్రకారం పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. జాప్యం జరగరాదని స్పష్టం చేశారు. ప్రాధాన్యతా భవనాలు పూర్తి చేసి అవసరమైన వసతికి సంబంధిత కార్యాలయాలకు సమకూర్చాలని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారి డాక్టర్‌ ఎంవిఆర్‌ కృష్ణాజీ, ఎంపిడిఒ కృష్ణమహేష్‌రెడ్డి, ఎఇ శంకరరావు, ఆర్‌ఐ ఎన్‌.శ్రీనుబాబు, గ్రామ సచివాలయ ఇంజనీరింగ్‌ సహాయకులు, తదితరులు పాల్గొన్నారు.

➡️